ప్రెస్‌మీట్లో భోరున విలపించిన చంద్రబాబు..
posted on Nov 19, 2021 12:52PM
కంటతడి కాదు.. కన్నీరు కూడా కాదు.. బోరున విలపించారు చంద్రబాబు. మీడియా ముందు ఎప్పుడూ హుందాగా ఉండే చంద్రబాబు కంట కన్నీరు ఆగలేదు. తన్నుకొచ్చిన ఏడుపును ఆపుకోలేకపోయారు. ముభానికి చేతులు అడ్డుపెట్టుకొని మరీ విలవిలా ఏడ్చేశారు. నిమిషాల పాటు అలా ఏడుస్తూనే ఉన్నారు. అంతలా ఏడిపించారు వైసీపీ నాయకులు.
తన భార్య భువనేశ్వరి గురించి అసెంబ్లీలో అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు మీడియా ముఖంగా వెక్కివెక్కి ఏడ్చారు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో చంద్రబాబును ఇలా ఎప్పుడూ చూసింది లేదు. చంద్రబాబు ఏడుపు చూస్తూంటే.. చూసిన వారికే ఏడుపు వచ్చేసింది. అంతలా బాధపడ్డారు. అంతలా కన్నీరు పెట్టారు. గొంతు జీరబోయింది. నోట మాట పెగలలేదు.
పాపం.. చంద్రబాబు.. వైసీపీ నేతలు ఎంతలా బాధపెట్టుంటారు. నిండు సభలో చంద్రబాబు భార్యను ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడటం ఎంత దారుణం.. ఎంత నీచం.. వైసీపీ సభ్యులు.. ఎమ్మెల్యేలా? లేక, కౌరవుల వారసులా? అంటూ అంతా మండిపడుతున్నారు.
తన బాధను చెప్పుకుందామంటూ స్పీకర్ తనకు కనీసం మైక్ కూడా ఇవ్వలేదంటూ మనోవేదనకు గురయ్యారు చంద్రబాబు. స్పీకర్ తీరుపై, వైసీపీ అరాచకంపై తీవ్రంగా ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రతిపక్ష నేత చంద్రబాబు.
