షర్మిలకు మోడీ పిలుపు.. తెలంగాణ రాజకీయాలలో పెను కుదుపు

వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిలకు మోడీ నుంచి పిలుపు అందింది. ఢిల్లీ రావాల్సిందిగా ప్రధాని  ఆమెను ఆహ్వానించారు. స్వయంగా షర్మిలకు ఫోన్ చేసి మరీ మోడీ ఢిల్లీ రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ షర్మిలతో దాదాపు పది నిముషాల సేపు ఫోన్ లో మాట్లాడారని సమాచారం. ఇప్పటికే షర్మిల తెలంగాణ రాజకీయాలలో విస్మరించరాని శక్తిగా ఎదిగారు. ఏడాదికి పైగా రాష్ట్రం అంతటా పాదయాత్ర చేసినా, తెరాసపై, తెరాస అధినాయకత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించినా, చివరాఖరికి హస్తిన వెళ్లి మరీ కాళేశ్వరం అవినీతిపై సీబీఐ, ఈడీలకు ఫిర్యాదు చేసినా రాని గుర్తింపు.. ఆమెను అరెస్టు చేసిన తీరుతో ఒక్కసారిగా వచ్చేసింది.

వరంగల్ జిల్లాలో ఆమె పాదయాత్రపై రాళ్ల దాడి, కార్ వ్యాన్ దగ్ధం సంఘటనలు, ఆనంతరం హైదరాబాద్ లో  ఆమె తన కారులో ఉండగానే టోయింగ్ చేసి మరీ పోలీసు స్టేషన్ కు తరలించడంతో ఒక్కసారిగా షర్మిల పొలిటికల్ గ్రాఫ్ అమాంతంగా పెరిగిపోయింది. రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల నుంచీ ఆమెకు మద్దతు లభించింది. ఆమె అరెస్టు ఎఫెక్ట్ తెరాస సర్కార్ ప్రతిష్టను మసకబార్చింది. అంతే కాకుండా ఆమె అన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు కూడా తాకింది. ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం (డిసెంబర్5) ఢిల్లీలో జరిగిన జీ-20 సదస్సు సన్నాహక సమావేశానికి హాజరైన జగన్ ను సొంత చెల్లెలి అరెస్టుపై ఎందుకు స్పందించలేదంటూ నిలదీశారు. సమాధానం చెప్పలేక, సమర్ధించుకోలేక జగన్ నీళ్లునమిలిన సంగతి విదితమే.

ఆ సందర్భంగా మోడీ షర్మిలను అరెస్టు చేసిన తీరు తనకు ఎంతో బాధకలిగించిందన్నారు. తోడబుట్టిన సోదరుడిగా మీరెందుకు స్పందించలేదని జగన్ ను ప్రశ్నించారు.  ఇది జరిగిన 24 గంటల వ్యవధిలోనే ప్రధాని స్వయంగా షర్మిలకు ఫోన్ చేసి హస్తినకు ఆహ్వానించారు. ఆమె అరెస్టు తీరును ఖండించి, ఆమెకు మద్దతు ప్రకటించారు.  ధైర్యంగా ఉండాలని చెప్పారు.  

తనకు మద్దతు తెలిపి, పరామర్శించిన ప్రధానికి షర్మిల ఈ సందర్బంగా  ధన్యవాదాలు తెలిపారు. ఆయన ఆహ్వానం మేరకు ఢిల్లీకి వచ్చి కలుస్తానని చెప్పారు. మొత్తం మీద షర్మిలకు మోడీ స్వయంగా ఫోన్ చేసి పరామర్శించడం, ఢిల్లీకి ఆహ్వానించడం తెలుగు రాష్ట్రాలలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.