వల్లభనేని వంశి, దేవినేని అవినాశ్ నివాసాలపై ఐటీ దాడులు

వైసీపీ నేతల నివాసాలపై ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. మంగళవారం (డిసెంబర్6) ఉదయం నుంచే వైసీపీ నేతలు దేవినేని అవినాష్, వల్లభనేని వంశీ నివాసాలలో ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. మొత్తంగా ఈ దాడులకు హైదరాబాద్ లింకులు ఉన్నట్లు చెబుతున్నారు.

గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాలలో కేంద్ర దర్యాప్తు సంస్థల సోదాలు, దాడులు కలకలం సృష్టిస్తున్న సంగతి విదితమే. ఓ వైపు ఢిల్లీ లిక్కర్ స్కాం, మరో వైపు చీకోటి ప్రవీణ్ కుమార్ క్యాసినో వ్యవహారం, ఇంకో వైపు పన్నుల ఎగవేత.. ఇలా వేరు వేరు కారణాలతో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ, ఐటీలు తెలుగు రాష్ట్రాలపై వరుస దాడులతో రాజకీయ వేత్తల గుండెల్లో గుబులు రేపుతున్నాయి.

తాజాగా వైసీపీ నాయకుడు, బెజవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ చార్జ్ దేవినేని అవినాశ్, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశి నివాసాలపై మంగళవారం ఉదయం నుంచీ సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో దేవినేని అవినాశ్ కు చెందిన స్థలం డెవలప్‌మెంట్ కోసం వంశీరామ్ బిల్డర్స్ తీసుకుంది.

ఆ ఒప్పందంలో  భాగంగా జరిగిన లావాదేవీలపైనే  ఐటీ అధికారులు ఈ సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఏపీతో పాటు తెలంగాణలో కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. వంశీరామ్ బిల్డర్స్ కార్యాలయం, ఆ సంస్థ చైర్మన్ సుబ్బారెడ్డి బావమరిది,  డైరెక్టర్ జనార్ధన్‌రెడ్డి  నివాసాలలో   ఏకకాలంలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మొత్తంగా  ఉభయ తెలుగు రాష్ట్రాలలో  36 చోట్ల ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.