ఆప్ ఆశలు గల్లంతు.. కాంగ్రెస్ కు నిరాశ..

హిమాచల ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి  జాతీయ స్థాయిలో హస్తం పార్టీ పై  పైచేయి సాధించాలని, ఆశలు పెంచుకున్న ఆప్(ఆమ్ ఆద్మీపార్టీ) కలలు కల్లలయ్యాయి. ఆప్  ఆశలపై ఎగ్జిట్ ఫలితాలు నీళ్లు చల్లాయి. ఆప్  అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి ఆశలు  ఎగ్జిట్  లో కొట్టుకు పోయాయి. అయితే, ఢిల్లీ ఎన్నికల్లో మాత్రం ఆప్  బీజేపీకి గట్టిగా జెల్ల కొట్టింది. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వమున్నా 15 ఏళ్లుగా, ఢిల్లీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (ఎంసీడీ) పై ఎగురుతున్న కాషాయ జెండాను, ఆప్   చీపురు దించేసింది. ఊడ్చేసింది. అయితే  ఇవి ఎగ్జిట్  ఫలితాలే, ‘అంతిమ’ తీర్పుకు ఇంకా సమయముంది ... ఢిల్లీ ఫలితాలు  బుధవారం(డిసెంబర్ 7) హిమాచల్, గుజరాత్ ఫలితాలు గురవారం(డిసెంబర్ 8) వెలువడతాయి.  అప్పుడు గానీ  అసలు కథ బయటకు రాదు. రాజెవరో రెడ్డెవరో తెలియదు.

అయితే  ఎగ్జిట్ ఫలితాలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయనే అభిప్రాయమే రాజకీయ విశ్లేషణలలో వినిపిస్తోంది.  అంకెల్లో స్వల్ప తేడాలున్నా గెలుపు ఓటముల విషయంలో మాత్రం ఇంచుమించుగా అన్ని ఛానల్స్, అన్ని సర్వే సంస్థల ఎగ్జిట్ ఫలితాలు ఒకేలా ఉన్నాయి. సో .. సీట్ల సంఖ్యలో  తేడాలున్నా  ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్  లో ఆప్ జెండా ఎగరడం ఖాయంగానే కనిపిస్తోంది.  అలాగే, గుజరాత్ లో వరసగా  ఏడవ సారి బీజేపీ అధికారం కైవసం చేసుకోవడం కూడా ఖరారైనట్లే ఎగ్జిట్ ఫలితాలు సూచిస్తున్నాయి. అయితే, హిమాచల్ లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య, నువ్వా నేనా అన్నట్లుగా పోటీ ఉన్నట్లుగా కనిపించినా  పోల్ అఫ్ పోల్  లో బీజేపీవైపే హిమాచల్   ఓటరు మొగ్గు చూపుతున్నట్లు ఎగ్జిట్ ఫలితాలు సూచిస్తున్నాయి. 

నిజానికి, గుజరాత్ లో కంటే హిమాచల్  పైనే కాంగ్రెస్ గట్టి ఆశలు పెట్టుకుంది. బీజేపీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకతతో పాటుగా, ఏ పార్టీకి వరసగా రెండవసారి అధికారం ఇవ్వని  ఆనవాయితీ మీద హస్తం పార్టీ గంపెడు ఆశలు పెట్టుకుంది. అయితే, హిమాచల్  ఓటర్లు ఈసారి ఆనవాయితీకి భిన్నగా వరసగా రెండవ సారి బీజేపీకి అనుకూలంగా తీర్పు ఇచ్చారని  ఎగ్జిట్  ఫలితాలు సూచిస్తున్నాయి. కేరళ అస్సాం, ఉత్తరాఖండ్  బాటలోనే హిమాచల్  ప్రదేశ్  ఓటర్లు కూడా ఆనవాయితీకి భిన్నంగా అధికార పార్టీకి సెకండ్ ఛాన్స్  ఇచ్చారని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతున్నాయి. 

68 స్థానాలున్న హిమాచల్ అసెంబ్లీలో బీజేపీ 38 స్థానాలతో మెజారిటీని నిలుపుకుంటుందని, పోల్ అఫ్ పోల్ సర్వే తెలిపింది. హిమాచల్ అసెంబ్లీకి మెజారిటీ మార్క్ 35 (మ్యాజిక్ ఫిగర్).  తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 28 సీట్లు వస్తాయని  టైమ్స్ నౌ అంచనా వేసింది. ఇక హిమాలయ రాజ్యంలో తొలిసారిగా అడుగుపెట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిందని వెల్లడించింది. ఆ పార్టీ ఇక్కడ ఖాతా కూడా తెరవదని పేర్కొంది.  ఇతరులకు 2 సీట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.

గుజరాత్ అసెంబ్లీలో మొత్తం 182 స్థానాలున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 92 . వివిధ ఎగ్జిట్ పోల్స్’లో  బీజేపీ 110 నుంచి 15౦ సీట్ల వరకు పొందే అవకాశం ఉందని సూచిస్తున్నాయి.
గుజరాత్, హిమాచల్ రాష్ట్రాలలో ఆప్  కాంగ్రెస్ పార్టీని అధిగమించక పోయినా, కాంగ్రెస్  ను ఓడించడంలో  మాత్రం కీలక పాత్రను పోషించింది.

ముఖ్యంగా, గుజరాత్ లో ముస్లిం ఓటు బ్యాంకు  కాంగ్రెస్ ఖాతా నుంచి ఆప్  ఖాతాలోకి ట్రాన్స్ఫరైందని సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి. అన్నటికంటే ముఖ్యంగా హిమాచల్, గుజరాత్, ఢిల్లీ ఎన్నికల ఎగ్జిట్ ఫలితాలు కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్నిమరోమారు నిరాశకు గురిచేశాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.ముఖ్యంగా రాహుల్ గాంధీ, భారత్ జోడో యాత్ర ప్రభావం కానీ, పార్టీ నాయకత్వ మార్పు ప్రభావం కానీ, ఈ ఎన్నికలలో ఏ మాత్రం కనిపించలేదని పరిశీలకులు అంటున్నారు. అలాగే, ఈ ఫలితాల ప్రభావం వచ్చే సంవత్సరం జరిగే, కర్ణాటక,మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, తెలంగాణ ఫలితాల్తో పాటుగా, 2024 సార్వత్రిక ఎన్నికలపై కూడా ఉంటుందని అంటున్నారు.