రాహుల్ గాంధీ రాజకీయ సన్యాసం ?

బుధవారం (డిసెంబర్ 7)   నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. అదే రోజున  ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి. ఆ మరుసటి రోజే అంటే.. గురువారం(డిసెంబర్ 8) హిమచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అదే రోజున ఫలితాలు కూడా వెలువడతాయి. ఇప్పటికే, ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో బుధ,గురు వారాలలో ఏమి జరుగుతుంది? అనే చర్చ  రాజకీయ వర్గాల్లో మొదలైంది. నిజానికి రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు  అంటే సరే, కానీ వీటిని 2024 ఎన్నికలకు సెమి ఫైనల్ గా భావిస్తున్నారు కాబట్టి  అదీ కాకున్నా,గుజరాత్ ప్రధాని మోడీ స్వరాష్ట్రం కావడం వలన   కూడా ఎన్నికల ఫలితాలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరగడాన్ని  అర్థం చేసుకోవచ్చును. కానీ పార్లమెంట్ సమావేశాల విషయంగా కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగగుతోంది. 

ముఖ్యంగా పార్లమెంట్ సమావేశాలు ప్రారంభానికి రెండు రోజులముందు ( ఆదివారం)  కాంగ్రెస్ పార్టీ స్టీరింగ్ కమిటి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో మొదటిది  భారత్ జోడో యాత్రలో ఉన్న కాంగ్రెస్ అగ్ర నేత  రాహుల్ గాంధీ పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావడం లేదు. ఇది కొంత వరకు ఉహించిందే  రాహుల్ గాంధీ, సెప్టెంబర్ 7 న యాత్ర ప్రారంభించినప్పటి నుంచి  యాత్ర మీదనే పూర్తిగా దృష్టి పెట్టారు. విలేకరుల సమావేశాల్లో మాట్లాడుతున్న సమయంలోనూ  యాత్ర ..నథింగ్ బట్ యాత్ర .. అన్నట్లుగా భారత్ జోడో యాత్రకు సంబందించిన విషయాలు మినహా మిగిలిన ఏ విషయాన్ని టచ్  చేయడం లేదు. విలేకరులు ఇతర విషయాలు ప్రస్తావించినా సారీ, అనేస్తున్నారు. సో .. రాహుల్ గాంధీ పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు హాజరు కాకపోవడం ఒక విధంగా ముందు నుంచి ఉహించిందే. 

అయితే  భారత్ జోడో యాత్ర పేరున రాహుల్ గాంధీ  రాజకీయాలకు దూరం అవుతున్నారా? ఒక గౌరవప్రదమైన రాజకీయ నిష్క్రమణ కోరుకుంటున్నారా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రాహుల్ గాంధీ యాత్ర లక్ష్యం ఎన్నికల ప్రయోజనాలు కాదని, కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కావచ్చు, రాహుల్ యాత్ర ప్రధాన లక్ష్యం ఎన్నికల ప్రయోజనాలు కాకపోవచ్చును, కానీ, ఒక రాజకీయ పార్టీ అధ్వర్యంలో  ఒక రాజకీయ నాయకుడు చేపట్టిన యాత్ర  ప్రత్యక్షంగా కాకున్నా  పరోక్షంగా అయినా రాజకీయ ప్రయోజనాలతో ముడిపడి ఉంటుంది. ఉదాహరణకు అద్వానీ చేపట్టిన రామజన్మ భూమి రథయాత్ర లక్ష్యం కూడా  అయోధ్యలో రామ మందిర నిర్మాణమే కానీ  బీజేపీని అధికారంలోకి తీసుకురావడం కాదు. కానీ అద్వానీ రథ యాత్ర ద్వారానే బీజేపీ అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది.  ఈ రోజు కేంద్రంలో సగానికి పైగా రాష్ట్రాలలో అధికారంలో వుంది.  కానీ, రాహుల్ ధోరణి అందుకు భిన్నంగా వుంది. రాహుల్ యాత్ర నడుస్తున్న సమయంలో హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి అయినా రాహుల్ గాంధీ ఆ ఎన్నికలకు ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదు. గుజరాత్ లో ఒకటి రెండు రోజులు మొక్కుబడిగా ప్రచారంలో పాల్గొన్నారు. హిమాచల్ లో అదీ లేదు. తెలంగాణలో యాత్ర సాగుతున్న సమయంలోనే మునుగోడు  ఉప ఎన్నిక జరిగింది. కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోయింది.

అయిన రాహుల్ గాంధీ  మునుగోడు ఫలితంపై ఒక్క ముక్క మాట్లాడ లేదు.  అలాగే, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్  అసెంబ్లీ ఎన్నికలోనూ కాంగ్రెస్ ఓటమి ఇంచుమించుగా ఖరారైనట్లే కనిపిస్తోంది. సరే ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం కానీ, పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ ఎన్నికల రాజకీయాల పట్ల నిరాసక్తత చూపడం దేనికి సంకేతం... ఇదే ప్రశ్న కాంగ్రెస్ నాయకులను వెంటాడుతోంది.. రాహుల్ గాంధీ రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నారా అన్న సందేహం కూడా వ్యక్తమవుతోంది.  అదొకటి అలా ఉంటే రాహుల్ యాత్రకు కొనసాగింపుగా ప్రియాంకా వాద్రా మహిళా మార్చ్’ పేరిట జనవరి నుంచి మహిళా జోడో యాత్ర ప్రారంభిస్తున్నారు. నిజానికి, రాహుల్ గాంధీ కంటే ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా కదులు తున్నారు. ఇది కూడా రాహుల్ రాజకీయ సన్యాసానికి సంకేతమా అనే అనుమానాలు  వ్యక్తం కావడానికి కారణమౌతున్నాయి.