బీఆర్ఎస్ మాజీ మంత్రిపై కవిత సంచలన వ్యాఖ్యలు
posted on Aug 3, 2025 11:51AM
.webp)
బీఆర్ఎస్ నేతలపై ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.. బీఆర్ఎస్ లో ఒకరిద్దరు పెద్ద నాయకులు వెనుక ఉండి తనపై విమర్శలు చేపిస్తున్నారని మండిపడ్డారు. పార్టీలో ఉన్నవారే తనపై విమర్శలు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.. దీనికి కారకులు ఎవరో తనకు తెలుసని అవసరమైనప్పుడు అందరి భాగోతం బయట పెడతానని హెచ్చరించారు.
నల్లగొండ జిల్లాకు చెందిన ఒక లిల్లీ పుట్ నాయకుడు ఆమె .. ఎవరని తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ధ్వజమెత్తారు. నల్గొండ జిల్లాలో ఆయన నిర్వాకం వల్లనే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర ఓటమి పాలైందన్నారు. ఆయన ఒక్కరే కొద్దితేడాతో గెలిచారని చెప్పారు.
కేసీఆర్ దయవల్లే బీఆర్ఎస్ లో అందరూ నాయకులుగా చలామణి అవుతున్నారని.. ఒకరిద్దరు మాత్రం తామే పార్టీలో సుప్రీం అనే భావనలో ఉన్నారని విమర్శించారు. గత కొంతకాలంగా బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేసి మాట్లాడుతున్న కవిత నేడు మీడియా సమావేశంలో పరోక్షంగా కేటీఆర్, జగదీశ్ రెడ్డిలను ఉద్దేశించి మరింతగా రెచ్చిపోయారు.
నల్లొండ జిల్లాలో బీఆర్‌ఎస్ పార్టీ ని నాశనం చేశాడని కవిత ఆరోపించారు. చావుతప్పి కన్ను లొట్టబోయినట్లు ఏదో గెలిచాడు. జిల్లాలో అన్ని సీట్లు ఓడిపోవడానికి కారణం ఆయనే అని కవిత అన్నారు. నా గురించి ఇంకోసారి మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని కవిత హెచ్చరించారు.
బీఆర్‌ఎస్‌లో ఒక ముఖ్య నాయకుడు మా జాగృతి లో కొందరు కోవర్టులను పెట్టి ఇక్కడి సమాచారమంతా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ నాయకుడికి చెబుతున్నా... మీ దగ్గర కూడా నా మనుషులు ఉన్నారు.. అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసు అన్నారు. ఆ ముఖ్య నాయకుడి ఆదేశాలతోనే నాపై జరుగుతున్న దాడులపై బీఆర్‌ఎస్ పార్టీ నేతలు స్పందించడం లేదని స్పష్టమైన సమాచారం ఉందని కవిత పేర్కొన్నారు
ఇటీవల ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కవితపై కీలక వ్యాఖ్యలు చేశారే. బీఆర్ఎస్‌లో కవిత పరిస్థితి ఏంటని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు జగదీష్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. కవిత గురించి మాట్లాడటానికి ఏం లేదు.
ఆమె గురించి మాట్లాడటం టేమ్ వేస్ట్. ఆమె గురించి పార్టీలో పెద్దగా ఎవరూ మాట్లాడుకోరు. ముఖ్యంగా ఆమె పార్టీకి చెందిన వ్యక్తిగా ఉంటే ఒక ఎమ్మెల్సీ మాత్రమే, కానీ పార్టీ దాటి బయటకు వెళ్తే ఏ విలువ ఉండదు అని జగదీష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా కవిత చేసిన వ్యాఖ్యలు ఆయన గురించే అని నెట్టింట చర్చ జరుగుతోంది.