డిఆర్సీ సమావేశంలో తిట్లదండకం
posted on Mar 31, 2013 7:37AM
.png)
ఆరు నెలల తరువాత మెదక్ జిల్లా ఇన్ ఛార్జీ డి.కె. అరుణ అధ్యక్షతన శనివారం జరిగింది. ఈ సమావేశానికి డాక్టర్ గీతారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యేలు ముత్యం రెడ్డి, నర్సారెడ్డి, కిష్టారెడ్డి, ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్ లు హాజరయ్యారు. సమావేశంలో ముత్యం రెడ్డి తన నియోజకవర్గంలో తనకు సమాచారం లేకుండా రూ.5 లక్షలు ఎలా కేటాయించారని అధికారులను ప్రశ్నించారు. అది ముత్యంరెడ్డి, ఫారుక్ మధ్య వివాదానికి దారి తీసింది. నువ్వు దొంగవి అంటే నువ్వు దొంగవి అని ఇద్దరూ తిట్టుకోవడం మొదలుపెట్టారు. డి.కే.అరుణ, ఎమ్మెల్యేలు వారిని శాంతింపచేశారు. మళ్ళీ ఉపాధి హామీ గురించి చర్చ జరుగుతుండగా ముత్యంరెడ్డి తన నియోజకవర్గ నిధుల నుంచి డ్వాక్రా భవనాల నిర్మాణానికి నిధులు ఇచ్చానని కానీ ఎన్ని బావుల పూడికలు తీశారో అధికారులు లెక్కలు ఇవ్వటంలేదని వారిపై మండిపడ్డారు. ఫారుక్ హుస్సేన్ కల్పించుకుని ఆడవారిని గౌరవించేలా మాట్లాడాలని ముత్యంరెడ్డికి హితవు పలికారు. దీంతో రెచ్చిపోయిన ముత్యం రెడ్డి మళ్ళీ తిట్ల దండకం అందుకున్నారు. హుస్సేన్ కూడా తానేమీ తీసిపోలేదని అతనూ తిట్ల దండకం ప్రారంభించారు. వీరిని శాంతింపచేయడానికి జిల్లా ఇన్ ఛార్జి, ఎమ్మెల్యేల ప్రాణం తోకకొచ్చింది. ఇలా ఇద్దరు ఒకే పార్టీకి చెందిన ప్రజాప్రతినిథులు నిసిగ్గుగా, బహిరంగంగా ఇద్దరు మహిళలు ఉన్న సభలో తిట్లదండకం మొదలుపెడితే ప్రజలకు ఏ విధమైన సందేశం ఇస్తున్నారు వారికే తెలియాలి.