సర్కారును కూల్చే విషయంలో జగన్‌కే స్పష్టత లేదు !

హైదరాబాద్: ఎమ్మెల్యేలు పార్టీ వీడుతారనే వార్తలను కొందరు జగన్ వర్గం నేతలు కొట్టిపారేసినప్పటికీ కాంగ్రెసులో కొందరు చేరడం ఖాయమనే వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. వారు జగన్‌ను వీడడానికి ఆయన తీరు కూడా కారణమట. సర్కారును కూల్చే విషయంలో జగన్‌కే స్పష్టత లేదని అలాంటి వారితో కలిసి ఉండటం కంటే కాంగ్రెసుతో వెళ్లడమే మంచిదని స్వయంగా జగన్ వర్గానికి చెందిన ఓ కాంగ్రెసు ఎమ్మెల్యే ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ చెప్పారట.జగన్ వర్గానికి చెందిన అత్యంత ముఖ్యులైన నేతలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని తరచూ కలిసి తమ నియోజకవర్గ అభివృద్ధి పనులు చేయించుకుంటున్నారని, కానీ సీనియర్లమైనప్పటికీ మా పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని వాపోయారట తాము ఎవరినీ చేయి చాచి అడగలేని పరిస్థితి అని దీంతో నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయాయని ఆవేదన చెందారట. జగన్ ఏకపక్ష నిర్ణయాల కారణంగా తాము ఇంకెంత కాలం ఆయనతో కొనసాగగలమని మళ్లీ కాంగ్రెసులోకి రావాల్సిందే అని చెప్పారట.

కాగా జగన్ నేతలు ఉన్నచోట ముఖ్యమంత్రి ఇంచార్జులను నియమించి అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకు వెళ్లడంతో ఆ ఎమ్మెల్యేలు ఉత్సవ విగ్రహాలుగా మారిపోవడం, జగన్ కూడా ఎన్నికల్లో తమకు సీటు ఇస్తానని హామీ ఇవ్వక పోవడం వంటి కారణలతో వారు కాంగ్రెసులోకి వస్తారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కేవలం ఏడుగురు ఎమ్మెల్యేలు మాత్రమే కాకుండా ఇంకా ఎక్కువమందే తిరిగి కాంగ్రెసులో చేరవచ్చుననే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu