మిస్ ఇండియాకు కరోనా.. మిస్ వరల్డ్ వాయిదా..
posted on Dec 17, 2021 10:19AM
'హర్నాజ్ కౌర్ సంధూ' ఇటీవలే మిస్ యూనివర్స్‌గా ఎంపికై భారతదేశ ఖ్యాతిని ప్రపంచ వేదికపై రెపరెపలాడించారు. అంతా ఆ సంబరాల్లో మునిగిపోయి ఉండగానే.. మిస్ వరల్డ్ పోటీలకు సమయం ఆసన్నమైంది. ఈసారి మిస్ యూనివర్స్‌తో పాటు మిస్ వరల్డ్ కూడా మనదే అవుతుందని అంతా ఆకాంక్షించారు. కానీ, అంతలోనే కరోనా దాడి చేసింది. మిస్ వరల్డ్‌కు పోటీ పడుతున్న మిస్ ఇండియా 2020 'మానస వారణాసి'కి కొవిడ్-19 పాజిటివ్ అని తేలడం కలకలం రేపింది. ఇండియాకి చెందిన మానస వారణాసితో సహా పలువురు పోటీదారులకు కరోనా సోకడంతో మిస్ వరల్డ్ 2021 పోటీలు వాయిదా పడ్డాయి.
డిసెంబర్ 16న ప్యూర్టోరికోలో మిస్ వరల్డ్ ఫినాలే జరగాల్సి ఉండగా.. కరోనా కారణంగా ముగింపు పోటీలను తాత్కాలికంగా వాయిదా వేశారు. పోటీదారులు, సిబ్బంది, సాధారణ ప్రజల ఆరోగ్యం, భద్రత కారణాలతో ఈవెంట్‌ను వాయిదా వేశామని నిర్వాహకులు తెలిపారు. వచ్చే 90 రోజుల్లో ప్యూర్టోరికోలోనే మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తామని ప్రకటించారు.
మిస్ వరల్డ్ 2021 పోటీదారులతో సహా 17 మంది సిబ్బంది కొవిడ్ బారిన పడ్డారు. కరోనా సోకిన వారిలో మిస్ ఇండియా 'మానస వారణాసి' కూడా ఉన్నారు. 23 ఏళ్ల మానస వారణాసి 70వ ప్రపంచ సుందరి పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం.. మానస ప్యూర్టోరికోలో ఐసోలేషన్‌లో ఉన్నారు.