ఓ మంత్రిగారు.. ‘జీఎస్టీ’ అంటే తెలియదంట..!


ఇప్పుడు దేశ వ్యాప్తంగా వినిపిస్తున్న మాట ‘జీఎస్టీ’. దేశ వ్యాప్తంగా ఒకే పన్ను ఉండాలన్న ఉద్దేశ్యంతో... ప్రస్తుతం దేశంలో అమల్లో ఉన్న ఎన్నో పన్ను చట్టాల స్థానంలో ఏకైక పన్ను చట్టమైన జీఎస్టీని అమల్లోకి తీసుకురానున్నారు. 2017 జూలై 1 నుంచి దీన్ని అమలు చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నిజానికి ఒకప్పుడు జీఎస్టీ గురించి పెద్దగా ఎవ్వరికీ తెలియదు. కానీ గత కొద్దిరోజులుగా దీనిపై చర్చలు జరుగుతుండటంతో ఇప్పుడు దాదాపు అందరికీ దీనిపై ఓ అవగాహన వచ్చింది. కానీ ఓ మంత్రిగారికి మాత్రం ఇంకా 'జీఎస్టీ' అంటే మాత్రం తెలియదంట. ఇంతకీ ఎవరా మంత్రివర్యులు అనుకుంటున్నారా..? ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎస్సీ, ఎస్టీ వ్యవహారాల శాఖ మంత్రి రమాపతి మహరాజ్‌గంజ్‌లో స్థానిక వ్యాపారులతో సమావేశమై జీఎస్టీ వల్ల ప్రయోజనాల గురించి చెబుతున్నారు. అయితే జీఎస్టీ అంటే ఏంటో నిర్వచనం చెప్పాలంటూ ఓ విలేకరి ప్రశ్నించాడు. ఒక్కసారిగా అలా అడిగేసరికి మంత్రి రమాపతి తెల్లమొహం వేశారు. అయితే పక్కనున్నవారు అర్థం చేసుకుని జీఎస్టీ అబ్రివేషన్‌ చెప్పినప్పటికీ మంత్రిగారు మాత్రం చెప్పలేక దొరికిపోయారు.  అంతేకాకుండా జీఎస్టీ అంటే ఏంటో తనకు తెలుసునని, కానీ ఇప్పుడు గుర్తుకు రావడం లేదని బుకాయించారు. మరి సామాన్య ప్రజలకైతే ఏదో దీనిపై అవగాహన లేదంటే అనుకోవచ్చు.. కానీ ఏకంగా మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తికే దీని గురించి తెలియదు అంటే మన రాజకీయ నాయకులకు ఎంత నాలెడ్జ్ ఉందో అర్దమవుతోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu