అర్ధరాత్రి లాంఛనంగా 'జీఎస్టీ' ప్రారంభం..
posted on Jun 30, 2017 1:16PM
.jpg)
దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఎవరి నోట విన్న ఒకటే మాట. అదే 'జీఎస్టీ'. రేపటి నుండి అమలు కానున్న ఈ కొత్త చట్టం గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ పన్ను విధానం వల్ల లాభమెంత? నష్టమెంత? దేని ధర పెరుగుతుంది? దేని ధర తగ్గుతుంది? దీనిపైనే చర్చోపచర్చలు సాగుతున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా జీఎస్టీ విధానం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఈరోజు అర్ధరాత్రి జీఎస్టీని లాంఛనంగా ప్రారంభించనున్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో అర్ధరాత్రి ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కాగా పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ప్రభుత్వం ఓ కార్యక్రమాన్ని నిర్వహించడం ఇది నాలుగోసారి. గతంలో 1947లో స్వాతంత్ర్యం ప్రకటించినపుడు, ఆ తరవాత 1972లో స్వాతంత్య్ర దినోత్సవ రజతోత్సవాలకు, 1997లో స్వాతంత్య్ర స్వర్ణోత్సావాలకు పార్లమెంట్ సెంట్రల్ హాల్ వేదికైంది. ఈ మూడు కార్యక్రమాలు అర్ధరాత్రే జరిగాయి.. ఇప్పుడు మళ్లీ జీఎస్టీని అర్ధరాత్రి ప్రారంభిస్తున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీ, మాజీ ప్రధానులు మన్మోహన్‌సింగ్, దేవెగౌడ, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ తదితరులు వేదికపై ఆసీనులయ్యే విధంగా షెడ్యూలు తయారు చేశారు. కానీ కాంగ్రెస్ కార్యక్రమాన్ని బహిష్కరించినందువల్ల మన్మోహన్‌సింగ్ హాజరుకావడంలేదు.