గోదావరి పుష్కరాల నిర్వహణ కోసం కుంభ్ ఏర్పాట్ల పరిశీలనలో మంత్రి నారాయణ

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలకు ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించింది. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యే పుష్కరాల ఏర్పాట్లలో ఎలాంటి పొరపొచ్చాలూ లేకుండా పకడ్బందీగా ఉండాలన్న ఉద్దేశంతో అడుగులు వేస్తున్నది. ఇందు కోసం ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాకు ఉత్తర ప్రదేశ్ చేసిన ఏర్పాట్లను పరిశీలిస్తోంది.

ఈ పరిశీలన కోసం మంత్రి నారాయణ నేతృత్వంలో ఒక బృందం అక్కడ పర్యటిస్తోంది. ఈ బృందం మంగళవారం (ఫిబ్రవరి 25) రెండో రోజు కుంభమేళా ఏర్పాట్ల పరిశీలనలో ఉంది. తొలి రోజు అంటే సోమవారం (ఫిబ్రవరి 24) మంత్రి నారాయణ బృందానికి కుంభమేళా కోసం ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లపై ఆ రాష్ట్ర  ప్రభుత్వాధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. భక్తుల రద్దీ, ట్రాఫిక్ నియంత్రణ, ట్రాన్స్ పోర్ట్ ఫెసిలిటీస్, పారిశుద్ధ్యం, పరిశుభ్రత, స్నాన ఘాట్ల వద్ద ఏర్పాట్లు, భద్రత తదితర అంశాల విషయంలో చేసిన ఏర్పాట్లు, తీసుకున్న జాగ్రత్తలపై యూపీ అధికారులు ఏపీ మంత్రి నారాయణ బృందానికి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.  ఇక మంగళవారం నారాయణ బృందం కుంభమేళాలో వివిధ సెక్టార్లలో ఏర్పాట్లను పరిశీలించనుంది.

ఇక మధ్యాహ్నం కుంభమేళాి అథారిటీ కార్యాలయంలో అధికారులతో భేటీ అవ్వనుంది. మొత్తం మీద కుంభమేళా స్థాయిలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లు చేయాలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ కలుగకుండా తీసుకోవలసిన చర్యలపై ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నది. ప్రయాగ్ రాజ్ వెళ్లిన బృందంలో మంత్రి నారాయణ వెంట మునిసిపల్ శాఖ డైరెక్టర్ సంపత్ కుమార్, రాజమహేంద్ర వరం మునిసిపల్ కమీషనర్ కేతన్ గార్గ్ తదితరులు ఉన్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu