చంద్రబాబు షాక్ ట్రీట్ మెంట్.. అధికారులు సెట్ అవుతారా?
posted on Feb 25, 2025 9:28AM

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి రాజీనామా వ్యవహారం సంచలనంగా మారింది. పైబర్ నెట్ చైర్మన్ పదవితోపాటు.. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు పంపించారు. వ్యక్తిగత కారణాల వల్లనే రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నప్పటికీ.. పైబర్ నెట్ ఎండీతో పాటు కొందరు అధికారుల తీరు పట్ల, పార్టీ అధిష్టానం వ్యవహారశైలి పట్ల ఆయన తీవ్ర మనస్తాపానికి గురైనందువల్లే రాజీనామా నిర్ణయం తీసుకున్నారని జీవీరెడ్డి సన్నిహితులు చెబుతున్నారు. తాజా ఘటనను చంద్రబాబు సీరియస్‌గా తీసుకున్నారు. జీవీ రెడ్డి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన కొద్దిసేపటికే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పైబర్ నెట్ చైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామాను ఆమోదించడంతో పాటు.. ఫైబర్ నెట్ ఎండీ దినేశ్ కుమార్‌ను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అంతే కాకుండా ఆయనఅదనంగా నిర్వహిస్తున్న ఆర్టీజీఎస్, గ్యాస్, డ్రోన్ కార్పొరేషన్ బాధ్యతల నుంచి కూడా తప్పించారు. ఎటువంటి పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు జీవీ రెడ్డి తొందరపాటు నిర్ణయాలపైనా చంద్రబాబు కొద్ది రోజులుగా ఆగ్రహంతో ఉన్నారని అంటున్నారు. ఏకపక్ష నిర్ణయాలతో ప్రభుత్వానికి ఇబ్బందులు తెస్తున్నారంటూ ఇటీవలే చంద్రబాబు జీవీ రెడ్డిని మందలించారని కూడా తెలుస్తోంది.
ఫైబర్ నెట్‌లో ఉద్యోగుల తొలగింపు, జీఎస్టీ చెల్లింపుల వంటి అంశాలపై మూడు రోజుల కిందట అధికారులపై జీవీ రెడ్డి ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వంలో నేతల సిఫార్సుతో నియమితులైన 410 మందిని తొలగించాలని డిసెంబరులోనే నిర్ణయించినా వారిలో ఒక్కరినీ తొలగించలేదని, వారు ఎక్కడ పనిచేస్తున్నారో తెలియకుండానే రూ.1.50 కోట్లు జీతాల కింద చెల్లించారని జీవీ రెడ్డి మండిపడ్డారు. ఈ క్రమంలో పైబర్ నెట్ ఎండీ దినేశ్ కుమార్, కొందరు అధికారులు రాజద్రోహానికి పాల్పడుతున్నారని, ప్రైవేటు సంస్థలతో కుమ్మక్కై సంస్థ ఆర్థిక మూలాలు దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. ఐఏఎస్ అధికారి అయిన ఎండీపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడం ఐఏఎస్ వర్గాల్లో తీవ్ర దుమారం రేపింది. ఈ వివాదంపై సీఎం చంద్రబాబు నాయుడు కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. శనివారం (ఫిబ్రవరి 22) సాయంత్రం సచివాలయంలో చంద్రబాబును జీవీ రెడ్డి కలిశారు. ఫైబర్‌నెట్‌లో జరుగుతున్న వ్యవహారాలపై సీఎంకు వివరణ ఇచ్చారు. అయితే, జీవీ రెడ్డి తొందరపాటు నిర్ణయంపై చంద్రబాబు ఒకింత అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సమస్య ఏదైనా ఉంటే సంబంధిత శాఖ ముఖ్యకార్యదర్శి, మంత్రి ద్వారా తన దృష్టికి తీసుకురాకుండా బహిరంగ ఆరోపణలు చేయడమేంటని జీవీరెడ్డిపై చంద్రబాబు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై గీతదాటితే వేటు తప్పదని కూడా హెచ్చరించినట్లు తెలిసింది.
జీవీ రెడ్డి ఫైబర్ నెట్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి పైబర్ నెట్‌ను మళ్లీ ట్రాక్ లోకి పెట్టేందుకు ప్రయత్నించారు. అయితే, ఈ క్రమంలో ఆయన ఐఏఎస్ అధికారి, ఎండీపై నేరుగా ఆరోపణలు చేయడం మాత్రం కలకలం రేపింది. ఇలాంటివి సంబంధిత శాఖ మంత్రి దృష్టికో, చంద్రబాబు, నారా లోకేశ్ దృష్టికో తీసుకెళ్లి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. మరోవైపు.. జీవీ రెడ్డి రాజీనామా వ్యవహారం టీడీపీకి రాజకీయంగా ఇబ్బందికరంగా మారింది. సమస్యను చంద్రబాబు, తెలుగుదేశం నేతలు సరిగ్గా డీల్ చేయలేదన్న అభిప్రాయం గట్టిగా వ్యక్తం అవుతోంది. జీవీ రెడ్డి రాజీనామాపై టీడీపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి గడిచిన ఐదేళ్ల కాలంలో టీడీపీ బలోపేతానికి జీవీరెడ్డి ఎంతగానో కృషి చేశారు. టీవీ డిబేట్‌లలో, మీడియా సమావేశాల్లో తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి హోదాలో వైసీపీ ప్రభుత్వం అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలపై తన వాయిస్‌ను బలంగా వినిపించారు. దీంతో తెలుగుదేశం శ్రేణులకు జీవీ రెడ్డి దగ్గరయ్యారు. తాజాగా ఆయన రాజీనామాతో సోషల్ మీడియా వేదికగా తెలుగుదేశం నేతలు, కార్యకర్తల నుంచి భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎక్కువ శాతం మంది ఈ విషయంలో జీవీ రెడ్డికి మద్దతుగా.. చంద్రబాబుకు వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు. వాస్తవాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే తాజా పరిణామంపై చంద్రబాబు తీసుకున్న నిర్ణయం సరైనదేనని చెప్పక తప్పదు.
ఎందుకంటే జీవీరెడ్డి పార్టీ జాతీయ అధికార ప్రతినిథిగా పార్టీ వాయిస్ ను మీడియాలో గట్టిగా వినిపించిన మాట వాస్తవమే. కానీ తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తరువాత కార్పొరేషన్ పదవి విషయంలో, ఆ తరువాత కేబినెట్ ర్యాంకు కోసం జీవీకే రెడ్డి అసంతృప్తిగళం వినిపించారు. తొందరపాటు ప్రదర్శించారు. క్రమశిక్షణ కట్టు తప్పి వ్యవహరించారు. అయినా సహించిన పార్టీ అధిష్ఠానం ఆయనకు పైబర్ నెట్ చైర్మన్ పదవి ఇచ్చి తగు విధంగా గుర్తించింది. జీవీరెడ్డి పైబర్ నెట్ లో అక్రమాలను బట్టబయలు చేయడాన్ని ఎవరూ తప్పు పట్టలేదు. కానీ ఆయన తొందరపాటు వ్యవహారశైలి పట్లే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధిపైనే దృష్టిపెట్టారు. ఈ క్రమంలో కొందరు ఐఏఎస్ లు, ఐపీఎస్ స్థాయి అధికారులతో పాటు కింది స్థాయి అధికారులు ప్రభుత్వం మాటను పెడచెవిన పెడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం నిర్ణయాలను తూచా తప్పకుండా పాటించని అధికారులపై చంద్రబాబు కొరడా ఝుళిపిస్తున్నారు. అయితే, తెలుగుదేశం, జనసేనలోని కొందరు నేతలు మాత్రం జగన్, వైసీపీ నేతలపైనా, వారికి అనుకూలంగా పనిచేస్తున్న అధికారులపైనా కేసులుపెట్టి జైళ్లకు పంపించాలని డిమాండ్ చేస్తున్నారు. అలా చేస్తే గత వైసీపీ ప్రభుత్వానికి, ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి తేడా ఉండదని చంద్రబాబు భావన. గత ప్రభుత్వంలోని అవినీతి అక్రమాలపై విచారణలు జరిపి నిందితులను చట్టపరంగా శిక్షిస్తామని, కూటమి నేతలు ఎవరూ కంగారుపడొద్దంటూ చంద్రబాబు చెబుతూ వస్తున్నారు. మరోవైపు.. ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న నేతలు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవద్దని చంద్రబాబు పదేపదే చెబుతున్నారు. అయినా, జీవీ రెడ్డి ఒకింత తొందరపాటుతో వ్యవహరించారనీ, సమస్యను ఒకటికి రెండుసార్లు సంబంధిత మంత్రి లేదా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళితే పరిష్కారం అయ్యేదని పార్టీ వర్గాలలో చర్చ జరుగుతోంది.
అందుకే చంద్రబాబు జీవీ రెడ్డి రాజీనామా ఆమోదించడం ద్వారా పార్టీ నేతలకు ఎండీ దినేశ్ కుమార్ ను ఆ పోస్టు నుంచి తొలగించడం ద్వారా తోక జాడించే అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారనే చెప్పాలి. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఎవరు గీతదాటినా చర్యలు తప్పవన్న గట్టి సందేశాన్ని చంద్రబాబు ఇచ్చారని ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.