విడాకులు కాదు.. వివాహ గ్రాడ్యుయేషన్ అంటా.. జపాన్‌లో ఈ వింత పద్దతి తెలుసా?

 

భారతదేశంలో వివాహం ఒక పవిత్ర బంధంగా పరిగణించబడుతుంది. పెళ్లయిన తర్వాత భార్యాభర్తలు ఒకరికొకరు తోడుగా ఉంటారు. కానీ ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా పెళ్లిళ్లు చాలా రకాలుగా కనిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో జపాన్ లో కొత్త రిలేషన్ షిప్ ట్రెండ్ పుట్టుకొచ్చింది.  ప్రప్రంచ వ్యాప్తంగా  దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ ట్రెండ్ కు వివాహ  గ్రాడ్యుయేషన్ అని పేరు పెట్టారు. దీని గురించి తెలుసుకుంటే..


సంప్రదాయ వివాహ సంబంధాలను కొత్త కోణంలో చూసే ప్రయత్నమే ఈ ధోరణి. ఇది విడాకులకు ఒక ఛాయిస్ గా  పరిగణించబడుతుందట. అయితే ఇది 2000 సంవత్సరంలో ప్రారంభమైందట.

అసలు మ్యారేజ్ గ్రాడ్యుయేషన్ అంటే ఏమిటి?

మ్యారేజ్ గ్రాడ్యుయేషన్ లేదా సోట్సుకాన్ అనేది భార్యాభర్తలు పరస్పర అంగీకారంతో విడివిడిగా జీవించాలని నిర్ణయించుకునే సంబంధం. విడాకులు, కోర్టు చికాకులు, మానసిక ఒత్తిడి వంటి బాధపెట్టే అంశాలు ఏవీ ఇందులో ఉండవు. ఇది పరస్పర గౌరవం,  అంగీకారంతో  తీసుకునే నిర్ణయం. తమ కలలు, వ్యక్తిగత లక్ష్యాలు లేదా స్వేచ్ఛను కోరుకునేవారికి  ఇది బాగా సూట్ అవుతుంది.

మ్యారేజ్ గ్రాడ్యుయేషన్ Vs విడాకులు..

    విడాకులు, మ్యారేజ్ గ్రాడ్యుయేషన్ ఈ  రెండూ ఒక బంధాన్ని ముగించడానికి  మార్గాలు. కానీ వాటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. విడాకులు అనేది ఒక చట్టపరమైన ప్రక్రియ. ఇది తరచుగా చాలా కష్టంతో,  ఒత్తిడితో కూడుకున్నది. దీంతో భార్యాభర్తలు విడిపోయి వారి బంధం పూర్తిగా ముగుస్తుంది. అయితే ఈ బంధం పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య ఏమైనా విబేధాలు వచ్చినా  మ్యారేజ్ గ్రాడ్యుయేషన్ అని కొత్త పేరు పెట్టుకుని ఆ బంధాన్ని మరొక రకంగా మార్చుకున్నారు.

మ్యారేజ్ గ్రాడ్యుయేషన్ లో భార్యాభర్తలు ఎలా ఉంటారు..


మ్యారేజ్ గ్రాడ్యుయేషన్  తరువాత భార్యాభర్తలుగా జీవించరు. వారు   భార్యాభర్తలుగా జీవించకుండా స్నేహితులుగానో, రూమ్ మేట్స్ గానో ఉంటారు. కొందరు ఒకే ఇంట్లో విడివిడిగా ఉంటూ తమ బాధ్యతలను స్వీకరిస్తారు. కొంతమంది వేర్వేరు ఇళ్లలో నివసిస్తారు. కానీ మ్యారేజ్ గ్రాడ్యుయేట్ అయినా సరే.. ఒకరినొకరు కలుస్తారు, ఒకరికొకరు  సహాయంగా ఉంటారు. మ్యారేజ్ గ్రాడ్యుయేషన్  అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే దీనికి లాయర్లు,  కోర్టులు  అవసరం లేదు. ఇద్దరి అంగీకారం ఉంటే చాలు.. ఇది చాలా సులభంగా జరిగిపోతుంది.

సొంత ఎదుగుదల..

మ్యారేజ్ గ్రాడ్యుయేషన్ తరువాత అప్పటివరకు భార్యాభర్తలుగా ఉన్నవారు కాస్తా వ్యక్తిగత జీవితంలోకి వెళ్లిపోతారు. వారు తమ ఎదుగుదలను, స్వేచ్ఛను ఎలాంటి సందేహాలు, ఒత్తిడులు లేకుండా చూసుకోగలుగుతారు. అయితే చట్టం దృష్టిలో మాత్రం వీరు విడిపోలేదని అర్థం.  కానీ తిరిగి మళ్లీ భార్యాభర్తలుగా కలుస్తారా లేదా అనేది మాత్రం తెలియదు.

 ఇదీ మ్యారేజ్ గ్రాడ్యుయేషన్ కహానీ..

                                            *రూపశ్రీ.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu