ఆర్కే అంత్యక్రియలకు భారీగా హాజరైన మావోయిస్టులు.. ఇవిగో ఫోటోలు..

మావోయిస్టు అగ్రనేత, సెంట్రల్ కమిటీ మెంబర్ అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అంత్యక్రియల ఫోటోలను మావోయిస్టు పార్టీ విడుదల చేసింది. తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఆర్కే అంత్యక్రియలు జరిగాయి. పామేడు-కొండపల్లి సరిహద్దు ప్రాంతాల్లో ఆర్కే అంత్యక్రియలు నిర్వహించినట్లు మావోయిస్టు పార్టీ వెల్లడించింది. మధ్యాహ్నం రెండు గంటలకు అంత్యక్రియలు పూర్తయ్యాయి. అంత్యక్రియలకు భారీగా హాజరయ్యారు మావోయిస్టులు. మావోయిస్టు లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆర్కే మృతదేహంపై ఎర్ర జెండా ఉంచి నివాళులు అర్పించారు మావోయిస్టులు.

సుకుమా-బీజాపూర్ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో ఆర్కే అనారోగ్యంతో గురువారం ఉదయం చనిపోయారు. మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ, అలియాస్ ఆర్.కెగా పని చేశారు. విప్లవోద్యమంలో ఆర్కేది తిరుగులేని పాత్ర. నేపాల్ నుంచి దక్షిణ భారతం వరకు ఆయనకు గొప్ప విప్లవ నేతగా గుర్తింపు ఉంది. నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు పార్టీలో కీలక నేతగా ఆర్కే కొనసాగారు. దేశవ్యాప్తంగా పలు కేసుల్లో ఆర్కే ప్రధాన సూత్రధారుడిగా ఉన్నారు. మాజీ సీఎం చంద్రబాబుపై దాడి కేసులో కూడా నిందితుడిగా ఉన్నారు. ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగారు. నాలుగేళ్ల క్రితం బలిమెల ఎన్‌కౌంటర్‌లో ఆయనకు బుల్లెట్ గాయం అయింది. అదే ఎన్ కౌంటర్ లో ఆయన కుమారుడు మృతి చెందాడు. బుల్లెట్ గాయమైనప్పటి నుంచి ఆర్కే అనారోగ్యంతో బాధపడుతున్నారు.