సీఎంకి స్కూల్‌ స్టూడెంట్ లెట‌ర్‌.. వెంట‌నే ఫోన్ చేసిన ముఖ్య‌మంత్రి.. అస‌లేం జ‌రిగిందంటే..

క‌రోనాతో స్కూల్స్ మూతప‌డ్డాయి. మ‌ళ్లీ ఎప్పుడు తెరుస్తారో తెలీటం లేదు. చ‌దువుల‌న్నీ అట‌కెక్కాయి. తాము చ‌దువుతున్న‌ది ఏ క్లాసో కూడా తెలీడం లేదు కొంద‌రు విద్యార్థుల‌కు. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి. త‌మిళ‌నాడులో మాత్రం ఇంకా పాఠ‌శాల‌లు తెరుచుకోలేదు. దీంతో.. ఆరో త‌ర‌గ‌తి చ‌దువుతున్న ఓ విద్యార్థినికి చిర్రెత్తుకొచ్చింది. బ‌డులు ఎప్పుడు తెరుస్తారో చెప్పాలంటూ ఏకంగా ముఖ్య‌మంత్రి స్టాలిన్‌కే లేఖ రాసింది ఆ చిన్నారి. లెట‌ర్ అయితే రాసింది స‌రే.. మ‌రి, ఇలాంటి లేఖ‌ను.. నిత్యం బిజీగా ఉండే సీఎం చ‌దువుతారా? త‌న లెట‌ర్‌కు రిప్లై వ‌స్తుందా? ఇవేవీ ఆలోచించ‌లేదు ఆ అమ్మాయి. స్కూల్స్ రీఓపెన్ గురించి తెలుసుకోవాల‌నుకుంది.. ఎవ‌రిని అడిగినా స‌రైన ఆన్స‌ర్ రావ‌ట్లేద‌ని.. నేరుగా చీఫ్ మినిస్ట‌ర్‌నే అడుగుతూ లెట‌ర్ రాయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. అయితే.. అంత‌కంటే అనూహ్య ప‌రిణామం చోటుచేసుకుంది. ఆ చిన్నారి రాసిన లేఖ‌ను సీఎం స్టాలిన్ చ‌దివారు. జ‌స్ట్‌.. చ‌ద‌వి ఊరుకోకుండా.. తిరిగి ప్ర‌త్యుత్త‌రం రాయ‌కుండా.. నేరుగా ఆ విద్యార్థినికే ఫోన్ చేసి.. ఆమె ప్ర‌శ్న‌కు వివ‌ర‌ణ ఇచ్చారు. ఈ ఘ‌ట‌న త‌మిళ‌నాట సంచ‌ల‌నంగా మారింది. స్టాలిన్ ప‌ని తీరు మ‌రోసారి ప్ర‌శంస‌లు అందుకుంటోంది. 

తమిళనాడు-కర్ణాటక సరిహద్దులోని హోసూరులోని టైటన్ టౌన్‌షిప్‌కు చెందిన ఆరవ తరగతి చదువుతున్న ప్రజ్ఞ అనే విద్యార్థిని ముఖ్యమంత్రి స్టాలిన్ కు లేఖ రాసింది. త‌న‌ స్కూల్‌ ఎప్పుడు పునర్ ప్రారంభం అవుతుందో తెలుసుకోవాలని అనుకుంటున్నానని సీఎంకు రాసిన లేఖలో కోరింది. లేఖలో తన ఫోన్ నంబరు కూడా ఇచ్చింది. బాలిక లేఖ చదివిన సీఎం స్టాలిన్ వెంటనే స్పందించారు. ప్రజ్ఞకు ఫోన్ చేసి మాట్లాడారు. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా నవంబరు 1 నుంచి పాఠశాలలు తెరవబోతున్నట్టు ముఖ్య‌మంత్రి చెప్పారు. 

‘‘నీవు చింతించవద్దు, కొవిడ్ భద్రతా ప్రోటోకాల్ ల ప్రకారం మీ టీచరు చేసే సూచనలు పాటిస్తూ మాస్కు ధరించి సామాజిక దూరం పాటిస్తూ పాఠశాలకు రావాలి’’ అని ప్ర‌జ్ఞ‌కు సీఎం స్టాలిన్ ఫోన్‌లో సూచన‌లు చేశారు. తాను రాసిన లేఖ చ‌దివి.. ముఖ్య‌మంత్రి స్టాలిన్ త‌న‌కు ఫోన్ చేసి మాట్లాడటం ఆశ్చ‌ర్యంగా ఉందంటోంది చిన్నారి ప్ర‌జ్ఞ‌.