అయోధ్య రామ మందిరం రెడీ.. భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఎప్పుడంటే..

అదిగ‌దిగో రామ‌మందిరం. మెజార్టీ హిందువుల చిర‌కాల స్వ‌ప్నం. రాముడు పుట్టిన చోట రామాల‌యం ఉండాలి కానీ, మ‌సీదు ఉండ‌ట‌మేంట‌నేది వివాదంగా మారి.. ద‌శాబ్దాలుగా ఉద్రిక్త‌త నెల‌కొని.. సుప్రీంకోర్టు తీర్పుతో క‌థ సుఖాంతమైంది. అప్ప‌టి నుంచి అయోధ్య‌లో రామ‌మందిర నిర్మాణం వేగంగా సాగుతోంది. తీర్పు రాక‌ముందునుంచే.. గుడి నిర్మాణానికి కావాల్సిన ఏర్పాట్లు సిద్ధం చేసింది ఆల‌య క‌మిటీ. శిల‌లు, శిల్పాలు అయోధ్య‌లో రెడీగా ఉన్నాయి. ఇలా సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్న‌ల్ ఇవ్వ‌గానే.. అలా గుడి నిర్మాణం మొద‌లైపోయింది. ప్ర‌స్తుతం ఓ కొలిక్కి వ‌చ్చింది. జై శ్రీ రాం.. నినాదాల‌తో అయోధ్య పుల‌కించే రోజుకు ముహూర్తం ఖ‌రారైంది. ఆ మేర‌కు విజయదశమి పర్వదినాన అయోధ్య శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. 

‘‘శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఆలయ నిర్మాణానికి సంబంధించిన ఫేజ్‌-1 పనులు పూర్తవ్వగా.. ఫేజ్‌-2 పనులు నవంబరు చివరి నాటికి ముగుస్తాయి. డిసెంబర్‌ 2023 నుంచి భక్తులకు దర్శనానికి అనుమతిస్తాం. అదే ఏడాది ఆలయంలో శ్రీరాముని మూలవిరాట్టు ప్రతిష్ఠాపన చేయాలని భావిస్తున్నాం’’ అని రామ మందిర నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ట్విటర్‌ వేదికగా వెల్లడించింది.  

గత ఏడాది ఆగస్టు 5న ప్రధాని మోదీ అయోధ్య రామ మందిరానికి భూమి పూజ చేసి నిర్మాణం ప్రారంభించారు. అహ్మదాబాద్‌కు చెందిన టెంపుల్‌ ఆర్కిటెక్ట్స్‌ ‘సోమ్‌పురా ఫ్యామిలీ’ అయోధ్య రామ మందిర నిర్మాణ బాధ్యతలు చేప‌ట్టింది. అయోధ్య భవ్య రామ మందిరం.. 2.77 ఎకరాల విస్తీర్ణంలో మూడు అంతస్తులు, ఐదు మండపాలతో నిర్మిస్తున్నారు. గర్భగుడి శిఖరం 161 అడుగుల ఎత్తుతో అల‌రార‌నుంది.