రన్ రాజా రన్


ఇవ్వాలేమీ రన్నింగ్ డే కాదు. ఏ ఒలింపిక్స్ డే కూడా కాదు!! మరింకేదో అథ్లెటిక్స్ డే కూడా కాదు. మరి ఈ రన్నింగ్ స్లోగన్ ఏమిటో అని అందరికి అనుమానం వస్తుంది. అంతేకాదు విషయం పూర్తిగా చదవకుండా చాలామంది గూగుల్ లోకి జంప్ చేసి ఇవ్వాళ విశేషం ఏముందా అని సెర్చ్ చేస్తారు. అంతా మనిషి కుతూహలం.ఈ ప్రపంచం  చాలా పెద్దది. ఎంత పెద్దది అంటే మన జీవితకాలం అంతా గడిచినా దాన్ని చూడలేం.  ప్రపంచం వరకు ఎందుకు మన దేశాన్నే చూడలేం. అది కూడా వద్దు మన ఊర్లో జరిగే మార్పులనే సరిగ్గా చూడం. ఇది కూడా ఎక్కువే మన ఇంట్లో వస్తున్న మార్పులను కనుక్కోలెం. మార్పు మొత్తం వచ్చేదాకా మనిషి దాన్ని గమనించని స్థాయిలో ఉన్నాడు. కారణం ఏమిటంటే బిజీ.మన చుట్టూ ఉన్న జంతువులకే గనుక  మాటలు వస్తే "ఈ మనుషులున్నారే!! తిండి తినడానికి సమయం లేదంటారు, తాగడానికి అలస్యమైపోతుందని అంటారు, నిద్రపోవడానికి పనులున్నాయని చెబుతారు. స్నేహితులను కలవాలన్నా, బంధువుల ఇళ్లకు వెళ్లాలన్నా, పార్టీలు అన్నా, ఏదో ఒక సాకు చెబుతూనే ఉంటారు. సంపాదనలో మునిగిపోతుంటారు. మళ్ళీ సంతోషంగా లేమంటారు. ఏమిటో వెధవ జీవులు ఈ మనుషులు" అని అంటాయేమో.

మనుషులేం చేసారిప్పుడు!!

మనుషులు మనుషులుగా ఉండటం లేదన్నది అందరూ గమనించుకోవలసిన మొదటి విషయం. వేగవంతమైన ప్రపంచంలో పరిగెట్టడమే పరమావధిగా పెట్టుకున్న మనుషులు జీవితాన్ని ఎంతవరకు ఆస్వాదించగలుగుతున్నారన్నది మొదటి ప్రశ్న. లక్ష్యాలు, పోటీల వలయంలో పడి, జీవితాన్ని ఎంతో మెరుగుదిద్దుకుంటున్నామని అనుకునేవాళ్లకు తమ జీవితం ఎంత మెరుగుపడిందో ప్రశ్న వేసుకుంటే అర్థమవుతుంది. బిజీ అవ్వడమూ, చేతిలో కాగితాల కట్టలు అందుకోవడమే ఎదుగుదల అనుకుంటే పొరపాటు. 

మనుషులేం చేయాలిప్పుడు!!

కాసింత జీవించడం అలవాటు చేసుకోవాలి. కాసింత మనస్ఫూర్తిగా నవ్వడం నేర్చుకోవాలి. కాస్త మానసికంగా తృప్తిని సంపాదించడం తెలుసుకోవాలి. తృప్తి అంటే డబ్బు పెట్టి కొంటేనో, డబ్బును కట్టలు కట్టలుగా పెట్టెల్లో దాచుకుంటేనో వచ్చేది కాదు. అది అనిర్వచనీయమైనది, అమూల్యమైనది. ఎటిఎం కార్డ్ తీసుకెళ్లి మిషెన్లో పెట్టి తీయగానే డబ్బు బయటకు వచ్చినట్టు తృప్తి రాదు. దానికి మనసనే ఓ గది ఉంది, దానికి తలుపులు ఉంటాయి. ఆ తలుపులను తెరవాలి. ఏమి కావాలో ఆలోచించుకోవాలిజీవితానికి కొన్ని అవసరాలు ఉంటాయి. మనిషి పుట్టిన, పెరిగిన పరిస్థితులు బట్టి ఆ అవసరాల జాబితా కూడా పెరుగుతుంది. ఇల్లు కొనాలి, కార్ కొనాలి, బైక్ కొనాలి, గోల్డ్ కొనాలి అబ్బో ఇలాంటివి చాలా ఉంటాయి. ఇవన్నీ జీవితంలో అవసరమే కానీ అవే జీవితం కాదు. అవి జీవితంలో ఒక భాగం మాత్రమే. వాటి కోసం అనవసరంగా ఒత్తిడిలో కూరుకుపోయి సంపాదిస్తే తరువాత పలితం చాలా బాధాకరంగా ఉంటుంది.

చివరకు మిగిలేది??

చిన్న సంతోషాలను కూడా మిస్సవుతూ, ఒత్తిడితో పనిచేస్తూ పోటీ పేరుతో మానసికంగా నలిగిపోతూ ఉండటం వల్ల ప్రస్తుతం సమాజంలో అధిక శాతం కొనితెచ్చుకుంటున్నది అనారోగ్యమే. డిప్రెషన్ దాని వల్ల అతిగా తినేయడం, తద్వారా అధిక రక్తపోటు, ఉబకాయం, మధుమేహం వంటి సమస్యలు. అవన్నీ కూడా చిన్నవయసులో అటాక్ చేస్తుండటం మరొక బాధాకరమైన విషయం. అందుకే అందుబాటులో ఉన్నవరకు చిన్న చిన్న విషయాలను కూడా ఆస్వాదించడం. వీలైనంత వరకు ప్రకృతికి దగ్గరగా ఉండేందుకు, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినేందుకు, స్నేహితులతో, బంధువులతో కలుస్తూ మనస్ఫూర్తిగా మాట్లాడుతూ, బంధాలకు విలువ ఇస్తూ అదేవిధంగా వృత్తికి న్యాయం చేస్తూ సాగిపోవాలి. 
మనసు తలుపులు తెరవండి బాస్అందుకే కేవలం పనిలో కాకుండా జీవితంలో పరిగెత్తాలి. రన్ రాజా రన్ అని ఎవరికి వారు ప్రోత్సాహాన్నిచ్చుకోవాలి, మరొకరికి ప్రోత్సాహాన్నివ్వాలి. కుదరకపోతే కనీసం ఈ ఆర్టికల్ ను షేర్ చేసి పరోక్షంగా ఉత్సాహాన్ని నింపేందుకు ప్రయత్నం చేయండి.


◆ వెంకటేష్ పువ్వాడ