మన్మోహన్ సింగ్: ఆర్థికవేత్తకి అవమానకర వీడ్కోలు
posted on May 17, 2014 1:41PM
.jpg)
ప్రధాని మన్మోహన్ సింగ్ పదవీకాలం ముగిసింది. ఆయన జాతిని ఉద్దేశించి ఇచ్చిన చివరి సందేశంలో ఆయన తన పదేళ్ళ పదవీకాలంలో తాను, కాంగ్రెస్ పార్టీ దేశం కోసం బోలెడంత చేశామని చెప్పుకొచ్చారు. దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించేశామని, అందుకు చాలా గర్వపడుతున్నామని చెప్పుకున్నారు. ఈ మాట చెప్పడానికి మన్మోహన్ ఎంతమాత్రం సిగ్గుపడకపోయినప్పటికీ, ప్రధాని సందేశం వింటున్న దేశ ప్రజలందరూ ఇలాంటి ప్రధాని పాలనలో ఇంతకాలం మగ్గిపోయామా అని సిగ్గుపడిపోయారు.
మన్మోహన్ తన పదేళ్ళ పదవీకాలంలో ఏమైనా సాధించారా లేదా అనేది ఆయన చెప్పుకోవలసిన అవసరం లేదు. దేశమే తన ఓటు ద్వారా చెప్పేసింది. దేశంలో గొప్ప ఆర్థికవేత్తగా పేరు తెచ్చుకున్న ఆయన, ఒకప్పడు దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేశారని పేరు తెచ్చుకున్న ఆయనకి దేశ ఆర్థిక రంగం ఇచ్చిన అవమానకర వీడ్కోలే చెబుతుంది. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఇంటికి వెళ్ళిపోవడం ఖాయమని తెలిసినప్పటి నుంచి గత పది రోజులుగా స్టాక్ మార్కెట్ పరుగులు తీస్తోంది.
దేశ ఆర్థిక రంగం ఉత్సాహంతో ఉరకలు వేసింది. కాంగ్రెస్ పాలన, మన్మోహన్ సింగ్ పాలన ఎప్పుడు ముగుస్తుందా, ఈ పీడా ఎప్పుడు వదులుతుందా అని దేశ ఆర్థిక రంగం ఆసక్తిగా ఎదురు చూసింది. ఒక ఆర్థికవేత్తగా పేరు తెచ్చుకున్న మన్మోహన్ పదవిలోంచి దిగిపోవాలని దేశంలోని ఆర్థిక రంగం కోరుకుందంటే ఆయనకు అంతకంటే అవమానం మరొకటి వుండదు. ఈ విషయం తెలిసి కూడా తన ప్రభుత్వం ఎంతో సాధించిందని చెప్పుకోవడం మన్మోహన్‌కి అంతకన్నా అవమానం.