ఒక్క సిగరెట్.. 300 కార్లు ఫసక్!!

 

బెంగళూరులోని ఎలహంక వైమానిక స్థావరంలో జరుగుతున్న ఏరో ఇండియా షోలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 300 కి పైగా వాహనాలు కాలి బూడిదయ్యాయి. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పది అగ్నిమాపక దళాలు మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. పార్కింగ్‌ స్థలంలో కొన్ని వందల కార్లు, ద్విచక్రవాహనాలు ఉన్నాయి. ఈ పార్కింగ్‌ స్థలానికి సమీపంలో కొన్ని విమానాలను కూడా ఉంచినట్లు తెలుస్తోంది. పార్కింగ్‌ ప్రదేశంలో ఎండు గడ్డి ఉండటంతో మంటలు త్వరగా వ్యాపించాయి. మంటలు ఉవ్వెత్తున ఎగసి పడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. ఏరో ఇండియా గేట్‌ నంబరు 5 వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలం వద్ద ఏడు అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. పార్కింగ్‌ చేసిన ఓ కారులో మంటలు చెలరేగి పక్కనే ఉన్న కార్లకు వ్యాపించడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న కొంతమంది అగ్నిమాపక సిబ్బంది స్వల్పంగా గాయపడ్డారు. అయితే నిప్పు ఆర్పని సిగరెట్ కారణంగానే ఈ మంటలు వ్యాపించి ఉంటాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.