జగన్ కొత్త ప్లాన్.. అంబటి రాంబాబుకి నో టికెట్!!

 

ఇప్పుడు వైసీపీలో విజయ సాయి రెడ్డి పేరు ఎలా వినిపిస్తుందో.. ఒకప్పుడు వైసీపీలో అంబటి రాంబాబు పేరు అలా మారుమ్రోగిపోయేది. కానీ ఆ మోత మూగబోవడానికి ఎంతో కాలం పట్టలేదు. గత ఎన్నికల్లో అంబటి రాంబాబు గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీచేసి.. టీడీపీ సీనియర్ నేత, అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఈసారి కూడా టీడీపీ తరపున సత్తెనపల్లి నుంచి కోడెల బరిలోకి దిగనున్నారు. గత ఎన్నికల్లో ఓటమిని చూసిన అంబటి వచ్చే ఎన్నికల్లో కూడా సత్తెనపల్లి నుంచి పోటీ చేసి కోడెలను ఓడించాలని అనుకుంటున్నారు. కానీ వైసీపీ అధినేత జగన్ మాత్రం అసలు అంబటికి టికెట్ ఇవ్వడానికే వెనకాడుతున్నారట. స్థానిక వైసీపీ నేతలతో విభేదాలు, ప్రజల్లోకి అంతగా వెళ్ళకపోవడం.. అదీగాక ప్రస్తుతమున్న పరిస్థితుల్లో సత్తెనపల్లిలో కోడెలను ఢీ కొట్టాలంటే బలమైన అభ్యర్థి కావాలని జగన్ భావిస్తున్నారట. అందుకే అంబటిని పక్కన పెట్టి.. టీడీపీలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. టీడీపీలో అధిష్టానం తీరు పట్ల అసంతృప్తితో ఉన్న మోదుగుల వేణుగోపాల్ రెడ్డి.. త్వరలోనే వైసీపీలో చేరతారనే టాక్ ఉంది. ప్రస్తుతం ఆయన గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. అయితే వైసీపీ తరపున ఆయనను సత్తెనపల్లి నుంచి రంగంలోకి దింపాలని జగన్ భావిస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి వైఎస్ జగన్‌కు మొదటి నుంచి అండగా ఉంటున్న అంబటి రాంబాబుకు ఈ సారి సత్తెనపల్లి నుంచి పోటీ చేసే అవకాశం దక్కుతుందా లేదా అన్నది సస్పెన్స్‌గా మారింది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.