అవినాష్ చేజారిన కడప?!

ఎంపీ అవినాష్ కు కపడ చేజారిపోయిందా? ఆయనకు వైసీపీ టికెట్ దక్కే అవకాశం లేదా? ఒక వేకడప ఎంపీ అవినాష్ రెడ్డిని వైసీపీ దూరం పెట్టేస్తుందా? అంటే వైసీపీ వర్గాలు ఔననే అంటున్నాయి. అలా పెట్టకుండా వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కడప లోక్ సభ నుంచి అవినాష్ కే పార్టీ టికెట్ ఇస్తే.. ఆయన గెలుపు అనుమానమేనని, అనుమానమేమిటి.. ఆయన ఓటమి తథ్యమని అంటున్నాయి. ఇందుకు వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ ప్రమేయాన్ని కడప వాసులు గట్టిగా నమ్ముతుండటమే కారణమని చెబుతున్నాయి. అవినాష్ తల్లి అనారోగ్యం పేరుతో కర్నూలు ఆస్పత్రి వద్ద చేసిన హంగామా తరువాత  జిల్లా వ్యాప్తంగా అవినాష్ రెడ్డి ప్రతిష్ట దిగజారిందనీ, వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు కడప ఎంపీ టికెట్  విషయమే కారణమని జనం గట్టిగా నమ్ముతున్నారని చెబుతున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అంశం ఏమిటంటే.. అవినాష్ రెడ్డికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో ఉన్న బంధుత్వం. బాబాయ్ వివేకానందరెడ్డితో జగన్ కు ఉన్న విభేదాలు. జగన్ తండ్రి వైఎస్ బతికి ఉన్న సమయంలోనే జగన్ కు కడప ఎంపీ టికెట్ కోసం పంచాయతీ జరిగింది. ఆ సందర్భంగా జగన్ వివేకాతో దురుసుగా ప్రవర్తించిన విషయం అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ వరకూ వెళ్లింది. అదలా ఉంచితే..  వైఎస్ వివేకా మరణం తరువాత కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ వైసీపీని ఏర్పాటు చేసుకున్నారు. బంధుత్వం కారణంగా వివేకాను సొంత పార్టీలోకి చేర్చుకున్నప్పటికీ జగన్ ఆయనను దూరంగా ఉంచుతూనే వచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో పరోక్షంగా ఆయన ఓటమికి కారణమయ్యారన్న ఆరోపణలూ ఉన్నాయి. అప్పట్లో వివేకా ఎమ్మెల్సీగా పరాజయం కావడం వెనుక అవినాష్ కీలకంగా వ్యవహరించారని చెబుతారు. అవన్నీ పక్కన పెడితే..కడప ఎంపీ సీటు విషయంలో  వివేకా గట్టిగా పట్టుబట్టారనీ, అయితే షర్మిల లేదా తాను పోటీ చేయాలి తప్ప అవినాష్ కు వైసీపీ టికెట్ ఇస్తే సహించేది లేదని కరాఖండీగా చెప్పడంతోనే ఆయన ఎలిమినేషన్ కు కుట్ర జరిగిందని చెబుతారు. జగన్ సోదరి షర్మిల అయితే బాబాయ్ వివేకానందరెడ్డి కడప ఎంపీ సీటు విషయంలో గట్టిగా నిలబడ్డారని బహిరంగంగానే చెప్పారు. ఇక సీబీఐ కూడా వివేకా హత్యకు రాజకీయకారణాలున్నాయని విస్పష్టంగా పేర్కొంది. కడప వాసులు కూడా వివేకా హత్య విషయంలో అవినాష్ ప్రమేయం ఉందనే విశ్వసిస్తున్నారు. అందుకే అవినాష్  2024 ఎన్నికలలో అవినాష్ పోటీ చేస్తే ఓడించడం తధ్యం అని చెబుతున్నారు. వైఎస్ కుమారుడిగా జగన్ కు కపడపై ఎంత పట్టు ఉన్నప్పటికీ... వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ కఃను కాపాడేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలను మాత్రం కడపవాసులు తప్పుపడుతున్నారు. దీంతో జగన్ కు అవినాష్ ను కడప నుంచి దూరం పెట్టడం తప్ప మరో మార్గం లేని పరిస్థితి ఏర్పడింది. అయితే అవినాష్ ను కాకుండా మరెవరిని నిలబెట్టాలన్న విషయానికి వస్తే.. అక్కడా జగన్ కు తాను దూరం పెట్టిన తల్లిని మళ్లీ తీసుకువచ్చి నిలబెడితే తప్ప ఆ సీటును కాపాడుకోలేని పరిస్థితి ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సరే జగన్ వెళ్లి తల్లిని కడప నుంచి వైసీపీ అభ్యర్థిగా నిలబడమని అర్ధిస్థారా? అలా అర్ధించినా, గౌరవాధ్యక్షురాలి పదవి నుంచి ‘సగౌరవంగా’ సాగనంపిన కొడుకు అభ్యర్థనను ఆమె ఔదాలుస్తారా అన్నవి ప్రశ్నలే? మొత్తం మీద అక్కడ నిలబడేది ఎవరన్నది పక్కన పెడితే ఆ సీటు అవినాష్ చేయి జారిందని మాత్రం నిస్సందేహంగా చెప్పవచ్చు.