చంచల్ గూడా జైలులో గాలి.. మామూలు ఖైదీయే.. ప్రత్యేక సదుపాయాలు లేవు
posted on May 9, 2025 9:55AM
.webp)
మైనింగ్ మాఫియా డాన్ గాలి జనార్దన్ రెడ్డి చంచల్ గూడ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఓబులాపురం మైనింగ్ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు గాలి జనార్దన్ రెడ్డికి ఏడేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో గాలి జనార్దన్ రెడ్డి ఇదే జైలుకు రావడం ఇదే మొదటి సారి కాదు. గతంలో కడా ఈ కేసులో గాలి జనార్దన్ రెడ్డి చంచల్ గూడ జైలులో ఊచలు లెక్కించారు. అయితే అప్పట్లో ఆయన రిమాండ్ ఖైదీగా ఈ జైలుకు వచ్చారు. దాంతో అప్పట్లో కోర్టు గాలి జనార్దన్ రెడ్డికి జైలులో కొన్ని ప్రత్యేక వసతులకు అనుమతించింది. అయితే ఈ సారి మాత్రం ఆయన ఓబులాపురం మైనింగ్ కేసులో దోషిగా నిర్ధారణకు గురై కోర్టు ఆదేశాల మేరకు ఏడేళ్ల జైలు శిక్ష అనుభవించడానికి వచ్చారు. దీంతో ఈ సారి ఆయనను చంచల్ గూడ జైలులో సాధారణ ఖైదీగానే పరిగణిస్తారు.
సాధారణ ఖైదీగా ఆయన ఖైదీలకు ఇచ్చే సాధారణ యూనిఫారం అంటే తెల్లటి దుస్తులే ధరించాల్సి ఉంటుంది. ఇక ఎలాంటి ప్రత్యేక సదుపాయాలూ ఉండవు. గాలి జనార్దన్ రెడ్డితో పాటు ఈ కేసులో శిక్ష పడిన ఆయన సమీప బంధువు శ్రీనివారెడ్డి, రాజ్ గోపాల్, అలీఖాన్ ను కూడా అదే జైలులో, అదే బ్యారక్ లో ఉన్నారు. ఇలా ఉండగా గాలి జనార్ధన్ రెడ్డిని ఆయన భార్య, కుమార్తె, సోదరుడు ములాఖత్ ద్వారా కలిశారు. సాధారణ జైలు దుస్తుల్లో ఉన్న గాలి జనార్దన్ రెడ్డిని చూసి ఆయన భార్య, కుమార్తె కన్నీటి పర్యంతమయ్యారు.