లోక్పాల్ బిల్లు ఫై తృణమూల్ మెలిక!

న్యూఢిల్లీ: అవినీతి నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లోక్పాల్ బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు రానుంది. బిల్లును సొంతగా ఆమోదించుకునేందుకు తగినంత సంఖ్యాబలం లేకపోయినప్పటికీ యూపీఏ సర్కారు మాత్రం పెద్దల సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టనుంది.అయితే, సంఖ్యాబలంపై ఆందోళనతో ఉన్న యూపీఏకు మిత్రపక్షమైన తృణమూల్ కాంగ్రెస్ కొత్త తంటా తెచ్చిపెట్టింది. బిల్లులో లోకాయుక్తల ఏర్పాటుకు సంబంధించిన నిబంధనల్లో సవరణలు ప్రతిపాదించాలని ఎగువ సభలో ఆరుగురు సభ్యులు గల తృణమూల్ నిర్ణయించుకుంది. సవరణ తీర్మానాలపై  నోటీసులూ ఇచ్చింది.

లోక్‌సభలో మంగళవారం ఆమోదం పొందిన ఈ బిల్లును వాస్తవానికి బుధవారమే రాజ్యసభలో ప్రవేశపెట్టాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల ప్రభుత్వం బుధవారం బిల్లును ప్రవేశపెట్టలేకపోయింది. ఎజెండా ప్రకారం బుధవారం బిల్లు ప్రవేశపెట్టకపోవడంపై విపక్షాలు మండిపడ్డాయి. రాజ్యసభలో సాయంత్రం 4.30 గంటలకు లోక్‌పాల్ బిల్లు కోసం విపక్షాలు పట్టుబట్టగా, తొలుత విజిల్ బ్లోయర్స్ బిల్లుపై చర్చిద్దామంటూ ప్రభుత్వం ప్రతిపాదించింది.దీంతో అధికార విపక్ష సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాలను నచ్చజెప్పేందుకు డిప్యూటీ ఛైర్మన్ రెహ్మాన్ ఖాన్ ఎంత ప్రయత్నించినా విపక్షాలు వెనక్కి తగ్గక పోవడంతో గురువారమే బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu