లిక్కర్ సిండికేట్లు సీఎం x బొత్స
posted on Dec 29, 2011 12:50PM
హైదరా
బాద్: మద్యం సిండికేట్లపై అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) దాడుల నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు మధ్య విభేదాలు ముదిరినట్లు తెలుస్తోంది. తన రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యం చేసుకుని మద్యం సిండికేట్లపై ముఖ్యమంత్రి దాడులు చేయించారనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. మద్యం సిండికేట్లతో బొత్స సత్యనారాయణకు సంబంధాలున్నట్లు కూడా ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలను బొత్స సత్యనారాయణ ఎప్పటికప్పుడు ఖండించుకుంటూ వస్తున్నారు. అయితే, ముఖ్యమంత్రి తీరు తనకు వ్యతిరేకంగా ఉందనే భావనకు బొత్స సత్యనారాయణ గురైనట్లు తెలుస్తోంది. మద్యం సిండికేట్లపై ఎసిబి దాడుల నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై బొత్స సత్యనారాయణ పార్టీ అధిష్టానానికి లేఖ రాసినట్లు వార్తలు వస్తున్నాయి. మద్యం సిండికేట్లతో తనకు ప్రమేయం లేదని చెబుతూ ఆ వ్యవహారంపై సిబిఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ బొత్స సత్యనారాయణ ఆ లేఖలో కోరినట్లు తెలుస్తోంది.