బెట్టింగ్ యాప్‌లపై రియాక్ట్ అయిన లోకేష్

బెట్టింగ్ యాప్‌లపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. బెట్టింగ్ యాప్‌ల వలన జీవితాలు నాశనం అవుతున్నాయని తనకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఎక్స్‌లో పెట్టిన ఒక పోస్టుపై లోకేష్ తీవ్రంగా రియాక్టయ్యారు. బెట్టింగ్ యాప్‌లపై రాష్ట్రంలో ఉక్కుపాదం మోపుతామన్న లోకేష్.. ఏపీలో బెట్టింగు యాప్‌ల నిషేధానికి సమగ్ర విధానాన్ని తీసుకువస్తామని తెలిపారు.

ఈ విధారం దేశానికే ఆదర్శంగా ఉండేలా ఉంటుందని చెప్పారు. న్యాయపరమైన అన్ని అవకాశాలను ఉపయోగించుకుని బెట్టింగ్ సంస్కృతిని ఆపేందుకు ప్రయత్నం చేస్తున్నామని, బెట్టింగ్ యాప్‌ల వలన జీవితాలు నాశనం అవుతున్నాయని పేర్కొన్నారు. అనేక మంది బెట్టింగ్ యాప్‌లకు ఆకర్షితులై ఆర్దికంగా దెబ్బతింటున్నారని, ఇటువంటి పరిస్థితి నుంచి వారిని కాపాడేందుకు అవగాహన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. బెట్టింగ్ యాప్‌లలో జూదం ఆడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.మొత్తం దేశానికే ఒక ఉదాహరణగా నిలిచే సమగ్ర బెట్టింగ్ వ్యతిరేక విధానంపై కృషి చేస్తున్నామని, ఈ ముప్పును అంతం చేయడానికి అన్ని చట్టపరమైన మార్గాలను అన్వేషిస్తామని ట్వీట్ చేశారు.