ఆ దేశంలో తొలి ఏటిఎం ప్రారంభించారు!

ఏటీఎం లేని దేశం ఉంటుందంటే నమ్ముతారా? కానీ ఇంతకాలం ఏటీఎం లేని ఆ దేశంలో మొట్టమొదటి ఏటీఎం ఇప్పుడే ప్రారంభించారు. మన దేశంలో ఏటీఎం ప్రారంభించాలంటే ఏ బ్రాంచి మేనేజరో, ఇతర అధికారో వెళ్తారు. కానీ, పసిఫిక్‌ సముద్రంలోని ఓ ద్వీప దేశంలో దీని  ప్రారంభోత్సవానికి..  ఏకంగా ప్రధానే హాజరయ్యారు. పెద్ద కేక్‌ కోసి సంబరాలు చేసుకున్నారు. ఎందుకంటే ఆ దేశంలో అదే తొలి ఏటీఎం మరి. అదే తువాలు దేశం. ఇది ఆస్ట్రేలియా-హవాయి మధ్య తొమ్మిది ద్వీపాలతో కలిసి ఏర్పడింది.

దాదాపు 11,200 మంది జనాభాతో 10 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఈ దేశం ఉంది. ఇక్కడ ఏప్రిల్‌ 15న తొలి ఏటీఎం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రధాని ఫెలెటి టెయో స్వయంగా హాజరయ్యారు. దేశ చరిత్రలో ఇది చెప్పుకోదగ్గ మైలురాయిగా అభివర్ణించారు. ఇది దేశానికి గొప్ప విజయమని.. మార్పునకు అవసరమైన కీలక స్విచ్‌ అని వక్తలు అభివర్ణించారు. పసిఫిక్‌ టెక్నాలజీ లిమిటెడ్‌ సంస్థ దీని తయారీకి నేషనల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ తువాలుకు సాయం చేసింది.
ఇటీవల కాలంలో సముద్ర మట్టాలు పెరిగి తమ భూభాగం కనుమరుగు అవుతుండటంతో తువాలు రెండేళ్ల క్రితం కీలక నిర్ణయం తీసుకుంది.

భావి తరాలకు సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేసేలా డిజిటల్‌ దేశంగా మారేందుకు ఏర్పాట్లు చేసుకుంది. ఈ దీవి రాజధాని ప్రాంతం ఇప్పటికే 40 శాతం సముద్రంలో కలిసిపోయింది. ఇదిలాగే కొనసాగితే ఈ దశాబ్దం చివరికి పూర్తిగా కనుమరుగు కావడమే కాకుండా, ప్రపంచంలో గ్లోబల్‌ వార్మింగ్‌కు బలయ్యే తొలి ద్వీపం ఇదే కానుందని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రాబోయే రోజుల్లో తువాలు కనుమరుగైనా.. మెటావర్స్‌ సాంకేతికత ద్వారా తమ దేశ ప్రకృతి అందాలు, ప్రజల జీవనశైలిని పర్యాటకులు చూసేలా ఏర్పాట్లు చేసుకుంది.