రాజ్ కసిరెడ్డి ఇంటెలిజెంట్ క్రిమినల్.. విజయసాయి
posted on Apr 19, 2025 6:55AM
.webp)
విజయసాయిరెడ్డి రాజీనామా ప్రకటన వెంటనే పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆయన రాజీనామా ప్రకటన ఒక విధంగా చెప్పాలంటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలోనే పెను సంచలనం సృష్టించింది. అదీ జగన్ విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో ఆయన వైసీపీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ తరువాత పెద్దగా సమయం తీసుకోకుండానే పార్టీకీ రాజీనామా చేఃసి రాజకీయ సన్యాసం ప్రకటించేశారు. రాజకీయం కాదు ఇక నుంచి వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించడమే కాదు.. రైతుగా కొత్త అవతారమెత్తానంటూ సాగు మొదలెట్టేశారు. తాను వ్యవసాయం చేస్తున్న ఫొటోలు సమాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పంచుకున్నారు. వ్యవసాయ వ్యాపకంతో ఎంతో సంతోషంగా ఉన్నానంటూ ఆ పోస్టులో పేర్కొన్నారు.
అయితే నాలుగు దశాబ్దాలకు పైగా వైఎస్ కుటుంబంతో అనుబంధం ఉన్న విజయసాయిరెడ్డి ఉన్న ఫలంగా జగన్ కు జెల్ల కొట్టి రాజకీయాలకు దూరం కావడమేంటి? అన్న అనుమానాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి కేవీపీ రామచంద్రరావు ఎలాగో.. జగన్ కు విజయసాయి అలాగ అనడానికి ఆయన రాజీనామా ప్రకటనకు ముందు వరకూ ఎవరిలోనూ సందేహం లేదు. అందుకే ఆయన రాజీనామా వెనుక కూడా ఏదైనా డ్రామా ఉందా? అన్న అనుమానాలు అప్పట్లో గట్టిగా వ్యక్తమయ్యాయి. అప్పట్లో అంటే విజయసాయి రాజీనామా ప్రకటన చేసిన సమయంలో అదంతా జగన్ వ్యూహంలో భాగమేనంటూ పరిశీలకులు విశ్లేషణలు చేశారు. ఒక విధంగా చెప్పాలంటే విజయసాయి రాజీనామా జగన్ మోడీ, బీజేపీకి పంపిన ప్రేమ సందేశంగా కూడా అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అందుకు తగ్గట్టే విజయసాయి తన రాజీనామా ప్రకటన సమయంలో జగన్ పట్ల విశ్వానాన్నే వ్యక్తం చేశారు. జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలనీ, ఆయన రాజకీయంగా పుంజుకోవాలనీ తాను ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో విజయసాయి రాజీనామా జగన్ ఆదేశం మేరకే జరిగిందని అప్పట్లో అంతా భావించారు.
కానీ ఆ తరువాత వరుసగా జరిగిన జరుగుతున్న పరిణామాలను గమనిస్తే జగన్, విజయసాయి మధ్య పూడ్చలేని, పూడ్చడానికి వీలుకాని అగాధమేదో ఏర్పడిందని అంతా భావిస్తున్నారు. తన రాజీనామా ప్రకటన తరువాత ఆయన జగన్ సోదరి షర్మిలతో హైదరాబాద్ లోని ఆమె నివాసంలో భేటీ అయ్యారు. గంటల పాటు జరిగిన ఆ భేటీలో షర్మిల విషయంలో తాను చేసిన వ్యాఖ్యలు, విమర్శలూ అన్నీ జగన్ రాసిచ్చిన స్క్రిప్టేనని వివరణ ఇచ్చుకున్నారు. ఆ తరువాత కాకినాడ పోర్టు భూముల వ్యవహారంలో గత నెలలో సీఐడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి ఆ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించారు.
ఆయన ఆ సందర్భంగా మాట్లాడిన మాటలన్నీ పరోక్షంగా జగన్ నే టార్గెట్ చేశాయి. ఆ సందర్భంగానే అసందర్భంగా విజయసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణం గురించి ప్రస్తావించారు. అప్పటి వరకూ ఏపీలో లిక్కర్ కుంభకోణమే జరగలేదని చెబుతూ వచ్చిన వైసీపీకి విజయసాయి రివీల్ చేసిన విషయం మింగుడుపడలేదు. అప్పుడే విజయఃసాయి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన లిక్కర్ కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ అన్ని రాజ్ కసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజశేఖరరెడ్డే అని చెప్పారు. అందుకు సంబంధించిన విషయాలు, వివరాలు సమయం వచ్చినప్పుడు బయటపెడతానన్నారు. ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డి మద్యం కుంభకోణం కేసులో శుక్రవారం (ఏప్రిల్ 18) ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా రాజ్ కసిరెడ్డి గురించి సంచలన విషయాలు చెప్పారు.
రాజ్ కసిరెడ్డి ఇంటెలిజెంట్ క్రిమినల్ అన్న విజయసాయిరెడ్డి అటువంటి నేరపూరిత మనస్తత్వం ఉన్న వ్యక్తిని తాను ఎన్నడూ చూడలేదన్నారు. వైసీపీలోని కొందరు నేతల ద్వారా రాజ్ కసిరెడ్డితో పరిచయం అయ్యిందనీ. అతడి గురించి తెలియని తాను పార్టీలో అతడి ఎదుగుదలకు దోహదపడ్డాననీ చెప్పుకొచ్చారు. భారీ మద్యం కుంభకోణానికి పాల్పడిన రాజ్ కసిరెడ్డి తనను మోసం చేశాడనీ, అయితే ఆ మోసం వల్ల తనకు వచ్చిన నష్టం ఏమీ లేదనీ అన్న విజయసాయిరెడ్డి, వైసీపీ హయాంలో 2019 చివరిలో నూతన మద్యం విధాన రూపకల్పనకు తన హైదరాబాద్, విజయవాడ నివాసాలలో రెండు సమావేశాలు జరిగాయని చెప్పారు. ఈ సమావేశాల్లో రాజ్ కసిరెడ్డి, మిథున్ రెడ్డి, సత్య ప్రసాద్, తాను ఉన్నామన్నారు ఈ సమావేశాల తరువాతే తాను రాజ్ కసిరెడ్డి, మిథున్ రెడ్డిలు అడగడంతో అరబిందో శరత్ చంద్రారెడ్డి చేత వంద కోట్ల రూపాయలు రుణం ఇప్పించానని తెలిపారు.
అది వినా ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం గురించి తనకేమీ తెలియదని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. సిట్ విచారణలో కూడా ఇదే చెప్పానని, మద్యం విధానం రూపొందిన తొలి నాళ్లలోనే తాను పార్టీలో క్రియాశీలంగా ఉన్నాననీ, ఆ తరువాత ఆ కుంభకోణం గురించి తనకేమీ తెలియదనీ చెప్పుకున్నారు. మద్యం కుంభకోణంలో ముడుపులు చేతులు మారాయా? ఎంతమేర అక్రమాలు జరిగాయి? అయితే విజయసాయి మీడియాతో మాట్లాడిన మాటలన్నీ మద్యం కుంభకోణంలో కసిరెడ్డి, మిధున్ రెడ్డిల పాత్రే కీలకమన్న విషయాన్ని పరోక్షంగా నిర్ధారించినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక విజయసాయి రెడ్డి ఈ సందర్భంగా జగన్ సొంత మీడియాపై కూడా విమర్శలు గుప్పించారు. ఇది కూడా ఆయన జగన్ తో ఢీ అనడానికి రెఢీగా ఉన్నారన్న విషయాన్ని ఎత్తి చూపుతోందని అంటున్నారు.