నారా లోకేష్.. పార్టీలో క్యాడర్.. ప్రజల్లో లీడర్!

నారా లోకేష్. ఏపీ రాజకీయాలలో ఆయన ఇప్పుడు సెంటరాఫ్ అట్రాక్షన్. రాజకీయాలలో అడుగుపెట్టక ముందే.. ఆయనలోని నాయకత్వ లక్షణాలను వైసీపీ పసిగట్టేసింది. అందుకే లోకేష్ రాజకీయాలంటేనే విరక్తి చెందాలన్న ఉద్దేశంతో  ఆయనపై విమర్శల దాడి చేసింది.  బాడీ షేమింగ్ కు పాల్పడింది. లోకేష్ ఆహారపు అలవాట్లను గేలి చేసింది. పప్పు అంటూ అవహేళన చేసింది. అయితే ఇదంతా గతం.. ఇప్పుడు లోకేష్ పరిపూర్ణమైన నాయకుడు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ది లీడర్.  ఆయన గురించి స్పష్టంగా చెప్పాలంటే.. తనను తాను నాయకుడిగా మలచుకున్న యవకుడు. విమర్శల ఉలి దెబ్బలకు శిల్పంగా మారిన నేత.

రాజకీయ అడుగులు ప్రారంభించిన సమయంలో  లోకేష్ మాట్లాడిన ఒకటీ రెండు అమాయకపు మాటలతో ట్రోల్ చేసే వారికి  తనయువగళం పాదయాత్రలో చెంపపెట్టులాంటి సమాధానం ఇచ్చారు.   వేలకిలోమీటర్లు నడిచి, ప్రజలతో మమేకమై  వారి కష్టాలను తెలుసుని, సొంత పార్టీలో, కార్యకర్తల్లో అసంతృప్తిని దూరం చేసి భరోసా ఇస్తూ ముందుకు సాగారు.  ప్రత్యర్ధుల విమర్శల దాడికి సమాధానం చెబుతూనే, లోకేష్ వారికి దిమ్మతిరిగేలా ప్రతి సవాళ్లు విసిరారు. పాదయాత్రలో భాగంగా  కియా ఫ్యాక్టరీ వద్ద లోకేష్ విసిరిన సెల్ఫీ చాలెంజ్ , అలాగే టిసిఎల్, జోహో, డిక్సన్ వంటి కంపెనీల వద్ద లోకేష్ విసిరిన సెల్ఫీ సవాళ్లు రాష్ట్ర యువతను ఆకట్టుకున్నాయి. డిక్సన్ కంపెనీ ఉద్యోగుల బస్సు ఎక్కి లోకేష్ సెల్ఫీ దిగుతూ.. మిస్టర్ జ‌గ‌న్ రెడ్డీ.. నేను తెచ్చిన డిక్సన్ కంపెనీ ఇది.. అందులో ఉద్యోగాలు చేస్తున్న అక్కాచెల్లెళ్లు వీరు.. నువ్వు ఒక్క కంపెనీ అయినా తెచ్చాన‌ని చెప్పుకోగ‌లవా? అంటూ నేరుగా అప్పటి సీఎం జగన్ కు విసిరిన సవాల్ వైసీపీ నేతల నోళ్లు మూయించింది. 

అంతెందుకు 2014--2019మధ్య కాలంలో ఆయన మంత్రిగా పనిచేసిన సందర్భంలో విపక్షాల ప్రశ్నలకు దీటుగా సమాధానం ఇచ్చారు. గణాంకాలతో సహా సోదాహరణంగా అపుడు మండలిలో లోకేష్ అనర్గల ప్రసంగానికి  సీనియర్లు అభినందించిన సందర్భాలు ఉన్నాయి. ఇపుడు లోకేష్ భారీ విజయం సాధించాక మంగళగిరిలో తన స్థానాన్ని పదిలపరచుకునే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు. ఏ ప్రజలు అయితే తనకు భారీ మెజార్టీ ఇచ్చారో వారి కోసం అహరహం శ్రమించి పనిచేయాలని లోకేష్ భావించి కార్యాచరణ మొదలెట్టేశారు.  మంగళగిరిలో లోకేష్ నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ కు విశేష స్పందన లభిస్తోంది. ప్రజల సమస్యలను సావధానంగా వినడమే గాక అప్పటికప్పుడే ఆయా సమస్యల పరిష్కారానికి అధికారుల ద్వారా చర్యలు చేపట్టడం ప్రజల్లో భరోసా కల్పిస్తోంది. అంతే కాదు సమస్యలు విన్న వించేందుకు వచ్చే ప్రజల కోసం ఆ ప్రాంతంలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని కూడా లోకేష భావిస్తున్నారు.   టీడీపీ యువ నాయ‌కుడు, విద్యాశాఖ‌, ఐటీ శాఖ‌ల మంత్రి నారా లోకేష్‌  గ్రాఫ్ ఈ నిర్ణయంతో పెరిగిందన్న వ్యాఖ్యలు వినవస్తున్నాయి. ప్రజలతో మమేకం కావడం ఆయ‌న‌కు మంచి ఇమేజ్‌ను తెచ్చి పెడుతున్నది.

మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన వెంట‌నే ఉండ‌వ‌ల్లిలోని త‌న నివాసంలో ప్ర‌జాద‌ర్బార్ ప్రారంభించారు. ప్ర‌స్తుతంత‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం మంగ‌ళ‌గిరి  వ‌ర‌కే దీనిని ప‌రిమితం చేశారు. రాబోయే రోజుల్లో జిల్లాల వారీగా కూడా.. ప్ర‌జాద‌ర్బార్ నిర్వ‌హించ‌నున్నారు. ఇప్పటికే అంటే లోకేష్ ప్రజాదర్బార్ ప్రారంభించిన రోజుల వ్యవధిలోనే మంగ‌ళగిరి ప్రజలలో లోకేష్ కు సమస్య చెప్పుకుంటే అది పరిష్కారమైపోయినట్లునన్న విశ్వాసం వ్యక్తం అవుతోంది. తమ కష్టాలను తీర్చడానికి ఓ నాయకుడున్నాడన్న భరోసా వారిలో కనిపిస్తోంది.  దీంతో నియోజ‌క‌వ‌ర్గం  నలుమూలల నుంచీ పెద్ద సంఖ్యలో జనం ఆయన నివాసానికి తరలి వస్తున్నారు. లోకేష్ అక్కడే ప్రజాదర్బార్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.  
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu