ఏపీ మద్యం కేసులో సిట్ అదుపులో మరొకరు
posted on Jul 31, 2025 9:34PM

ఏపీ మద్యం కుంభ కోణ కేసులో మరొకరిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. A48 సుజన బెహ్రాన్‌ను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని ఆమెను విజయవాడకు తరలించారు. ఇప్పటికే 48కి నిందితుల సంఖ్య చేరింది. లిక్కర్ స్కామ్‌లో సిట్ దూకుడు పెంచింది. అడిషనల్ ఛార్జ్‌షీట్ సిద్దం చేయనున్నట్లు తెలుస్తోంది. సిట్ అధికారులు బుధవారం హైదరాబాద్‌లోని శంషాబాద్, కాచారం ప్రాంతంలో నిర్వహించిన సోదాల్లో రూ. 11 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తాన్ని ఎస్.ఐ.టి కార్యాలయానికి తరలించిన అధికారులు, దీనికి సంబంధించిన మెమోను గురువారం ఏసీబీ కోర్టుకు సమర్పించారు.
ఇప్పటికే రాజ్ కసిరెడ్డి, గోవిందప్ప బాలాజీతో పాటు మాజీ సీఎం వైఎస్ జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డిని అరెస్ట్ చేసి విచారించారు. వారి విచారణ ఆధారంగా బునేటి చాణక్య, వరుణ్, వినయ్ వంటి మరికొంతమందిని కూడా అరెస్ట్ చేశారు. ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న కొందరు విదేశాలకు పారిపోయినట్లు సిట్ గుర్తించింది. వారిని తిరిగి దేశానికి రప్పించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రాథమిక దర్యాప్తులో సుమారు రూ. 3500 కోట్ల మేర మద్యం కుంభకోణం జరిగిందని సిట్ అధికారులు అంచనా వేస్తున్నారు.