కేసీఆర్ ఫామ్ హౌస్‌లో కలకలం.. కూలి పనికి వెళ్లిన యువకుడి మృతి
posted on Dec 22, 2021 11:32AM
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఫామ్ హౌస్ లో కలకలం రేగింది. ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్‌లో కూలి పనికి వెళ్లిన యువకుడు చనిపోవడం తీవ్ర దుమారం రేపుతోంది. యువకుడు అక్కడి వ్యవసాయ బావిలో పడి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుని కుటుంబ సభ్యులు ఎర్రవెళ్లి ఫాహౌస్ ముందు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత తలెత్తింది. ఈ ఘటనతో సీఎం కేసీఆర్ టెన్షన్ పడుతున్నారని తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ క్షేత్రంలోకి చాలా మంది కూలీలు పనికోసం వెళ్తుంటారు. ఈ క్రమంలోనే ఎర్రవల్లి పక్కనే ఉన్న వరద రాజాపూర్ గ్రామానికి చెందిన ఆంజనేయులు (19) మంగళవారం ఫామ్ హౌస్ లో కూలి పనులకోసం వెళ్లాడు. అయితే ఆయన అక్కడ పనిచేస్తున్నక్రమంలో ఓ బావి వద్ద చెట్ల పొదలు ఉన్నాయి. వాటిని తొలగించాలని అధికారులు చెప్పడంతో వాటిని తొలిగిస్తూ ఆబావిలో జారిపడిపోయాడు. అతన్ని బావిలో నుంచి బయటకు తీసేసరికి అతను చనిపోయాడు.