ఏపీలో మరో ఒమిక్రాన్ కేసు.. తెలుగు రాష్ట్రాల్లో డేంజర్ బెల్స్..
posted on Dec 22, 2021 11:29AM
ఒమిక్రాన్. ప్రపంచాన్ని వేగంగా చుట్టేస్తోంది. ఎక్కడో ఆఫ్రికా దేశాల్లో ఈ కొత్త వేరియంట్ పుట్టుకొచ్చినా.. వేగంగా ప్రపంచ దేశాలను ఆక్రమించేస్తోంది. ఇండియాలో ఎప్పుడో ఎంట్రీ ఇచ్చేసింది. తెలుగురాష్ట్రాల్లోకి చొచ్చుకొచ్చింది. దేశంలో ఒమిక్రాన్ వెలుగు చూసిన కొత్తల్లోనే విజయనగరం జిల్లాలో ఓ కేసు నమోదవడం కలకలం రేపింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఒమిక్రాన్ కేసులు రాలేదు. అదే సమయంలో తెలంగాణలో మాత్రం విజృంభించింది. ఇప్పటికి తెలంగాణలో 20కిపైగా ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తాజాగా, ఏపీలో రెండో ఒమిక్రాన్ కేసు నమోదైంది. కెన్యా నుంచి తిరుపతి వచ్చిన మహిళకు ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. 39 ఏళ్ల మహిళ ఈనెల 12న కెన్యా నుంచి చెన్నై వచ్చారు. అక్కడి నుంచి తిరుపతి చేరుకున్నారు. ఈ విషయం తెలిసి మహిళ నమూనాలను సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపారు అధికారులు.
తిరుపతి మహిళకు ఒమిక్రాన్ సోకినట్లు తాజాగా నిర్ధారణ అయింది. అయితే ఆ మహిళ కుటుంబసభ్యులకు మాత్రం నెగటివ్ వచ్చింది. ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు విజయనగరం జిల్లాలో నమోదుకాగా.. రెండో కేసు తిరుపతిలో వెలుగు చూసింది. తెలంగాణలో మాదిరే ఏపీలోనూ ఒమిక్రాన్ కేసులు పెరుగుతాయా? అనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.