వైసీపీ మేయర్ పీఠం తెలుగుదేశం కూటమి కైవసం
posted on Apr 19, 2025 3:42PM
.webp)
ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్దదైన విశాఖపట్నం నగరపాలక సంస్థ తెలుగుదేశం కూటమి వశం అయ్యింది. వైసీపీ చేతిలో ఉన్న ఈ మేయర్ పీఠన్ని దక్కించుకోవడానికి తెలుగుదేశం కూటమి వ్యూహాత్మకంగా పావులు కదిపింది. విశాఖ మేయర్ పీఠం లక్ష్యంగా కూటమి వ్యూహాలు, వైసీపీ ప్రతి వ్యూహాలతో గత కొన్ని రోజులుగా విశాఖలో రాజకీయ వేడి పెరిగిన సంగతి తెలిసిందే.
నాలుగేళ్ల కిందట జరిగిన ఎన్నికలలో విశాఖ మేయర్ పీఠాన్ని అప్పట్లో అధికారంలో ఉన్న వైసీపీ దక్కించుకుంది. విశాఖ కార్పొరేషన్ లో మొత్తం 98 కార్పొరేటర్ల స్థానాలు ఉండగా, వాటిలో 59 స్థానాలలో వైపీపీ విజయం సాధించింది. విశాఖ మేయర్ గా గొలగాని హరి వెంకట కుమారిని మేయర్ గా గెలిపించుకుంది. అయితే గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టకుని అధికారాన్ని కోల్పోవడంతో పరిస్థితి మారింది. విశాఖ కార్పొరేషన్ లో వైసీపీ బలం క్షీణించింది. పలువురు కార్పొరేటర్లు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. విశాఖ మేయర్ గా గొలగాని హరివెంకటకుమారి పదవీ కాలం నాలుగేళ్లు పూర్తి కావడంతో కూటమి పార్టీలు మేయర్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. వైసీపీ ప్రభుత్వం పతనమైన తరువాత ఆ పార్టీ కార్పొరేటర్లు పలువురు కూటమి పార్టీల్లోకి దూకేయడంతో విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ లో కూటమి బలం 53కు పెరిగింది. వైసీపీ బలం 38కి పడిపోయింది.
దీంతో తెలుగుదేశం కూటమి మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టగానే వైసీపీ అప్రమత్తమైంది. తమతో ఉన్న 38 కార్పొరేటర్లూ జారిపోకుండా వారిని క్యాంపుకు తరలించింది. మేయర్ పిఠం చేజారకుండా ఉండేందుకు సీనియర్ నేత, మండలిలో వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ రంగంలోకి దిగారు. దేశం నుంచి వైసీపీ కార్పొరేటర్ల క్యాంపును శ్రీలంకకు తరలించేశారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఫలితం లేకపోయింది. చివరకు అవిశ్వాస తీర్మానానికి ఒక రోజు ముందు మాజీ మంత్రి, వైసీపీ నేత ముత్తంశెట్టి కుమార్తె, 6వ వార్డు కార్పొరేటర్ అయిన ప్రియాంక రాజీనామా చేశారు. క్యాంపు నుంచి తిరిగి వచ్చిన వెంటనే జరిగిన ఈ పరిణామంతోనే వైసీపీ నుంచి మేయర్ పీఠం చేజారిపోవడం ఖాయమైపోయింది.
ఈ దశలో బొత్స పార్టీ కార్పొరేటర్లకు విప్ జారీ చేసినా ఫలితం లేకపోయింది. చివరకు శనివారం అంటే అవిశ్వాస తీర్మానం రోజున వైసీపీ కార్పొరేటర్లు గైర్హాజరయ్యారు. అయితే అప్పటికే కూటమికకి అవసరమైన కార్పొరేటర్ల బలం చేకూరింది. వారంతా సమావేశానికి హాజరు కావడంతో అవిశ్వాస తీర్మానం గెలిచింది. వైపీపీ మేయర్ పీఠాన్ని కోల్పోయింది.