కేంద్రానికి ఆ దమ్ముందా?..ముందస్తు పై మంత్రి కేటీఆర్

తెలంగాణలో ముందస్తు ఎన్నికల చర్చను మంత్రి కేటీఆర్ మరోమారు తెరపైకి తీసుకు వచ్చారు. ఆయన ముందస్తు ఎన్నికల విషయంలో బంతిని బీజేపీ కోర్టులోకి నెట్టేశారు. కేంద్రం లోక్ సభను  రద్దు చేసి ముందస్తుకు రెడీ అయితే తాము కూడా అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు సిద్ధం అని పేర్కొన్నారు. 

ఇటీవల అభివృద్ధ, సంక్షేమ పథకాలను ప్రారంభిస్తూ తెలంగాణ ప్రభుత్వం జోరుగా ముందుకుసాగతం,  ముఖ్యమంత్రి  కేసీఆర్ జిల్లాల పర్యటనల చేపడుతున్న నేపథ్యంలో మరో సారి రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఖాయమనే ప్రచారంజోరందుకుంది.  వచ్చే నెల 17న కొత్త సెక్రటేరియట్‌కు కేసీఆర్ ప్రారంభోత్సవం చేయడనుండటం, ఫిబ్రవరి మొదటి తేదీన లేదా ఆ మరుసటి రోజు బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించడం వంటి అంశాలన్నీ ముందస్తు ఎన్నికలు ఖాయమన్న భావాన్ని కలిగిస్తున్నాయి.  కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటు రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం జోరందుకుంది.  ఈ క్రమంలోనే నిజామాబాద్ పర్యటనలో మంత్రి కేటీఆర్ ముందస్తు ప్రస్తావన తీసుకురావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

  ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని క్యాడర్ కు పిలుపునిచ్చారు. శనివారం (జనవరి 28) నిజామాబాద్ లో పర్యటించిన ఆయన  ముందస్తుకు సిద్ధపడితే తాము కూడా రెడీ అని సవాల్ చేశారు.  కేంద్రంలోని మోడీ సర్కార్ కు ఇదే చివరి బడ్జెట్ అని కేటీఆర్ అన్నారు. తెలంగాణకు పసుపు బోర్డు ఏమైందని ప్రశ్నించారు. తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ సర్కార్ కక్ష కట్టిందన్నారు. కేంద్రం చేయలేని అభివృద్ధిని రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం చేసి చూపిందన్నారు.  

రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పే సత్తా మాకుందని.. కేంద్రం ఏం చేసిందో చెప్పే సత్తా బీజేపీకి ఉందా అని నిలదీశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుండి కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదని.. విభజన హామీలను ఇప్పటి వరకు నెరవేర్చలేదన్నారు. రెండు లక్షల కోట్ల తెలంగాణ పన్నులను.. కేంద్ర పాలనలో ఉన్న రాష్ట్రాల్లో వాడుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ నుండి కేంద్ర రూపాయి తీసుకుని.. తిరిగి రాష్ట్రానికి కేవలం 46 పైసలే ఇస్తోందని.. నేను చెప్పిన ఈ లెక్క తప్పు అయితే రాజీనామాకు సిద్ధమని కేటీఆర్ ఛాలెంజ్ విసిరారు.