తారకరత్న కోలుకోవడానికి సమయం పడుతుందంటున్న వైద్యులు

నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న నందమూరి తారకరత్న గుండెపోటుకు గురైన   బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి విదితమే. ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు శనివారం (జనవరి 28) విడుదల చేసిన హెల్త్ బులిటిన్ లో పేర్కొన్నారు. కాగా తారకరత్నను పరామర్శించేందుకు శనివారం సాయంత్రం బెంగళూరు చేరుకున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు.. నారాయణ హృదయాలయ ఆసుపత్రికి వెళ్లి తారకరత్న ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి  తెలుసుకున్నారు. తారకరత్న కుటుంబ సభ్యులకు   ధైర్యం చెప్పారు. తారకరత్నకు ఐసీయీలో చికిత్స కొనసాగుతోందని, అబ్జర్వేషన్ లో పెట్టారని వెల్లడించారు.  తారకరత్న త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు చంద్రబాబు. 

 నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు వచ్చిన  తారకరత్నకు గుండెపోటు రావడంతో కుప్పం ఆసుపత్రిలో తారకరత్నకు ప్రాథమిక వైద్యం అందించిన అనంతరం బెంగళూరు ఆసుపత్రి నుంచి వచ్చిన వైద్యుల సలహా మేరకు మరింత మెరుగైన చికిత్స కోసం తారకరత్నను బెంగళూరు హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సమాచారం ప్రకారం తారకరత్నకు రక్త  ప్రసరణలో ఇంకా అంతరాలు వస్తున్నాయి. బ్లాక్స్ అధికంగా ఉన్న కారణంగా తారకరత్న కోలుకునేందుకు ఎక్కువి సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు.   ఇలా ఉండగా తారకరత్నకు ప్రస్తుతం బెలూన్ యాంజియోప్లాస్టీ ద్వారా రక్తాన్ని పంపింగ్ చేసేందుకు వైద్యులు ప్రయత్నం చేస్తున్నారు. ఎక్మో ద్వారా కృత్రిమ శ్వాస అందిస్తున్నారు.

తారకరత్నను హృదయాలయ ఆసుపత్రిలో శనివారం (జనవరి 28) పరామర్శించిన వారిలో దగ్గుబాటి పురంధేశ్వరి దంపతులు కూడా ఉన్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్న దగ్గుబాటి ఆ తరువాత మీడియాతో మాట్లాడారు. చిన్న వయస్సులో తారకరత్నకు గుండెపోటు రావడం బాధాకరమన్నారు. సోమవారం తారకరత్నకు మరిన్ని పరీక్షలు నిర్వహించి ఎలా చికిత్స కొనసాగించాలన్న విషయం వైద్యులు నిర్ణయిస్తారన్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని, కోలుకోవాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నామనీ అన్నారు.