నాయకుడిగా కేటీఆర్ వైఫల్యం ఫిక్సైపోయినట్లేనా?.. సీఎం కల చెదిరిపోయినట్లేనా?

బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాజకీయ అజ్ణాతం నుంచి బయటకు వచ్చేస్తున్నారు. బుధవారం (ఫిబ్రవరి 19) ఆయన బీఆర్ఎస్ కార్యనిర్వాహక సమావేశంలో ప్రసంగించనున్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ రజతోత్సవ వేడుకల నిర్వహణపై చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ అధ్యక్షడి హోదాలో కేసీఆర్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. 2023 ఎన్నికలలో పరాజయం పాలై అధికారాన్ని కోల్పోయిన తరువాత కేసీఆర్ దాదాపు రాజకీయ అజ్ణాత వాసం చేశారు.

పూర్తిగా ఫాం హౌస్ కే పరిమితమయ్యారు. మధ్యలో 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో పార్టీ తరఫున ప్రచారం చేసినా అదేమంత చెప్పుకోదగ్గ విషయం కాదు. మొత్తం మీద ఒక దశలో ఆయన రాజకీయ సన్యాసం పుచ్చుకున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. అడపాదడపా తనను కలవడానికి వచ్చిన పార్టీ నేతలతో ఫామ్ హౌస్ లో రాజకీయాలపై, పార్టీ విషయాలపై మాట్లాడినా అదంతా ఆఫ్ ది రికార్డ్ అన్నట్లుగానే ఉండేది. అయితే ఇప్పుడు కేసీఆర్ తన రాజకీయ అజ్ణాత వాసం నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నారు.

అది పార్టీ నేతల్లో, క్యాడర్ లో నూతనోత్సాహాన్నినింపవచ్చు కానీ అదే సమయంలో మరో విషయాన్ని కూడా తేటతెల్లం చేస్తోంది. అదేమిటంటే పార్టీని ముందుండి నడిపించడంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు వైఫల్యం. ఔను కేసీఆర్ రాజకీయ వారసుడిగా కేటీఆర్ తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టడానికి కేసీఆర్ ఎప్పుడో అవసరమైన రూట్ క్లియర్ చేశారు. బీఆర్ఎస్ రెండో సారి విజయం సాధించగానే కేటీఆర్ ను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిని చేసి.. తన తరువాత సీఎం కేటీఆరేనన్న సంకేతాలు ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే కేటీఆర్ ప్రభుత్వంలో డిఫాక్టో సీఎంగానే వ్యవహరించారు. ప్రభుత్వ విధాన నిర్ణయాలను కూడా ఆయనే ప్రకటించే వారు. ఒక దశలో కేసీఆర్ జాతీయ రాజకీయాలలోకి దూకేస్తున్నారనీ, అంతకు ముందే కేటీఆర్ ను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోపెట్టేస్తారని పార్టీ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే తెరవెనుక ఏం జరిగిందో తెలియదు కానీ  కేటీఆర్ పట్టాభిషేకం వాయిదా పడుతూ వచ్చింది.  

వాస్తవానికి 2018లో ముఖ్యమంత్రి కేసీఅర్ ముందస్తు ఆసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళాలని నిర్ణయించినప్పటి నుంచి, కేటీఆర్ పట్టాభిషేకం వార్తల్లో నలుగుతూనే ఉంది. అందుకోసమే ముందస్తుకు వెళ్ళారని అప్పట్లోనే  గట్టిగా వినిపించింది. ఇక 2019 లోక్ సభ ఎన్నికల ముందు అయితే కేసీఆర్ జాతీయ రాజకీయాలలోకి వెళ్ళడం ఖాయమని  అన్నారు. ప్రాంతీయ పార్టీల ఫ్రంట్’ ఏర్పడిపోయినట్లే ప్రచారం జరిగిపోయింది. అదే సమయంలో కేటీఆర్’ సైతం పట్టాభిషేకానికి రెడీ అయిపోయారు. అయితే, అప్పట్లో కారు సారు   పదహారు నినాదం బూమరాంగ్ అయ్యింది. దీంతో కేసీఆర్ ఢిల్లీ కలే కాదు.. కేటీఆర్ సీఎం కల కూడా ... కరిగిపోయింది.  

సరే 2023 ఎన్నికలలో బీఆర్ఎస్ ఓడిపోయింది. అధికారం కోల్పోయి ప్రతిపక్షానికి పరిమితమైంది. కేసీఆర్ రాజకీయ అజ్ణాత వాసంలోకి వెళ్లిపోయారు. ఈ పరిస్థితుల్లో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ పార్టీని ముందుండి నడిపించడంలో విఫలమయ్యారని పార్టీ వర్గాల నుంచే విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యమంత్రి రేవంత్ దూకుడును కేటీఆర్ నిలువరించడంలో విఫలమయ్యారని పరిశీలకులు సైతం విశ్లేషణలు చేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ రాజకీయ అజ్ణాతం వీడి బయటకు రావడానికి రెడీ అయ్యారు. అంతకంటే ముందు.. కేటీఆర్ స్వయంగా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందనీ, కేసీఆర్ మూడో సారి ముఖ్యమంత్రిగా పదవీ పగ్గాలు చేపడతారని చెప్పారు. ఇలా చెప్పడం ద్వారా కేటీఆర్ తన వైఫల్యాన్ని స్వయంగా అంగీకరించడమే కాకుండా సీఎం రేసులో లేననీ, తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్ మాత్రమే ఉన్నారని స్పష్టంగా చెప్పేశారు. దీంతో ఇహ ఇప్పట్లో కేటీఆర్  సీఎం అనే మాట వినిపించే అవకాశమే లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu