జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు.. బీఆర్ఎస్ పరువు గంగలో కలిసిందిగా?

రాజకీయాలలో ప్రత్యర్థుల వ్యూహాలను పసిగట్టడమే కాదు, పకడ్బందీగా ప్రతి వ్యూహాలనూ అమలు చేయాల్సి ఉంటుంది. ఎత్తులు, పై ఎత్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయాలలో యాక్టివ్ గా ఉన్నంత కాలం... ఆయన వ్యూహాలు, ఎత్తుగడలు ప్రత్యర్థుల అంచ నాలకు మించి ఉండేవి. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం తరువాత ఆయన పొలిటికల్ గా ఒకింత ఇన్ యాక్టివ్ అయ్యారు. ఇప్పుడు యాక్టివ్ అవుతానంటున్నారు అది వేరే సంగతి. కానీ ఈ లోగానే బీఆర్ఎస్ వ్యూహరచనలో, ప్రత్యర్థుల వ్యూహాలను పసిగట్టడంలో, వారి ఎత్తుగడలను అంచనా వేయడంలో విఫలమై పరువుపోగొట్టుకుంది. 

ఇంతకీ విషయం ఏమిటంటే.. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీకి జరిగే ఎన్నికలలో సంప్రదాయానికి విరుద్ధంగా బీఆర్ఎస్ పోటీలో నిలవాలని నిర్ణయించుకుంది. ఇద్దరు అభ్యర్థుల చేత నామినేషన్ కూడా వేయించింది. బీజీపీ మద్దతుతో స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో అధికార కాంగ్రెస్ ను చావుదెబ్బ కొట్టాలని భావించింది. అందుకోసం బీజేపీతో చర్చలు కూడా జరిపింది. కాంగ్రెస్ ను దెబ్బ కొట్టడానికి బీఆర్ఎస్, బీజేపీలు చేతులు కలపాలన్న ఒప్పందానికి కూడా వచ్చాయి. 

జీహెచ్ఎంసీ లో మొత్తం 150 డివిజన్లు ఉన్నాయి. ఈ 150 డివిజన్ల కార్పొరేటర్ల నుంచి ఏటా స్టాండింగ్ కమిటీ లేదా స్టాండింగ్ కౌన్సిల్ కు 15 మంది సభ్యులను ఎన్నుకుంటారు. ఇప్పటి వరకూ ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగానే జరిగాయి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ కు దెబ్బకొట్టాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్, బీజేపీలు ఎన్నికలకు సిద్ధపడ్డాయి. వాటి ధైర్యం ఏమిటంటే 150 మంది  కార్పొరేటర్లలో బీఆర్ఎస్ కు 56 మంది, బీజేపీకి 48 మంది ఉన్నారు. ఎంఐఎంకు 44 మంది ఉన్నారు.  కాంగ్రెస్ కు ఇద్దరు కార్పొరేటర్ల బలం మాత్రమే ఉండేది. అయితే 2023 ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించి రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టడంతో  కొందరు కార్పొరేటర్లు కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. దీంతో కాంగ్రెస్ బలం 24కు పెరిగింది. అదే సమయంలో బీఆర్ఎస్ బలం  42కు, బీజేపీ బలం 40కి పడిపోయింది. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్, బీజేపీలు చేతులు కలిపి కాంగ్రెస్ ను దెబ్బతీయాలని భావించాయి. ఎన్నికలకు సిద్ధమయ్యాయి. స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో నామినేషన్ల దాఖలుకు సోమవారం (ఫిబ్రవరి 17) చివరి తేదీ. సరిగ్గా చివరి నిముషంలో బీజేపీ బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చి పోటీ నుంచి వైదొలగింది.

ఆ పార్టీ తరఫున పోటీ చేయడానికి ఒక్క కార్పొరేటర్ కూడా నామినేషన్ దాఖలు చేయలేదు.  దీంతో ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు తమ నామినేషన్లను ఉపసంహ రించుకోవడం తప్ప మరో గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడింది. వారు ఉపసంహరిం చుకుంటే ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. బీఆర్ఎస్ పరువు గంగలో కలుస్తుంది. అలా కాకుండా పోటీలో కొనసాగినా గెలిచే అవకాశాలు ఇసుమంతైనా లేవు. ఎందుకంటే ఎంఐఎం, కాంగ్రెస్ చేతులు కలిపి పోటీలోకి దిగాయి. దీంతో ఎంఐఎం, కాంగ్రెస్ లకు కలిపి బలం 65కు పెరిగింది. అంతే కాకుండా బీఆర్ఎస్ కార్పొరేటర్లు 42 మంది ఇన్ టాక్ట్ గా ఉంటారన్న నమ్మకం బీఆర్ఎస్ లోనే లేదు.  దీంతో బీజేపీని నమ్మకుని బీఆర్ఎస్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు రెడీ అయ్యి పరువుపోగొట్టుకుంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu