అయినా జగన్ మారలేదు.. 2.0 ఉత్తుత్తి మాటలే!?
posted on Feb 18, 2025 9:10AM
.webp)
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెంగళూరు నుంచి తాడేపల్లికి చేరుకున్నారు. ఈ ఉదయం ఆయన బెంగళూరు నుంచి విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని.. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో తన తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లారు. తరువాత విజయవాడ జిల్లా జైలుకు వెళ్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో ములాఖత్ అవుతారు.
వల్లభనేని వంశీ కిడ్నాప్ కేసులో అరెస్టై విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి విదితమే. వంశీని జగన్ జైల్లో పరామర్శించడానికి వెళ్లడం పట్ల వైసీపీలోనే ఒకింత అభ్యంతరం వ్యక్తం అవుతోంది. వైసీపీ అధికారంలో ఉండగా ఇష్టారీతిగా చెలరేగిపోయి, అప్పటి ప్రతిపక్ష నేతపైనా ఆయన కుటుంబ సభ్యులపైనా అనుచిత వ్యాఖ్యలు చేసిన వంశీని గత ఏడాది జరిగిన ఎన్నికలలో జనం తిరస్కరించారు. అంతే కాదు.. వంశీ వంటి నేతలను ప్రోత్సహించిన జగన్ పార్టీకి కూడా గత ఎన్నికలలో జనం దిమ్మతిరిగే షాక్ ఇచ్చి ఘోరంగా ఒడించారు. ఇప్పుడు తాను మారాననీ, ఇక నుంచి పార్టీకీ, పార్టీ క్యాడర్ కు అండగా నిలుస్తాననీ, జగన్ 2.0ను చూస్తారనీ ఊదరగొడుతున్న జగన్ ఇప్పుడు అట్రాసిటీ కేసులో అరెస్టైన వంశీని పరామర్శించడానికి వెళ్లడం చూస్తుంటే ఆయన వైసీపీ కార్యకర్తలకు కాదు.. పార్టీని జగన్ అండ చూసుకుని భ్రష్టుపట్టించిన వారికే వత్తాసుగా ఉంటారని అర్ధమౌతోందని పార్టీ శ్రేణులే అంటున్నాయి.
2019 ఎన్నికలకు ముందు ఒక్క చాన్స్ ఇవ్వండి అంటూ జనాలను కోరుకుని.. అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి.. అధికారంలో ఉన్న ఐదేళ్లూ ప్రజలకు నరకం చూపించారు. ఇక ప్రతిపక్ష నేతల గురించి చెప్పాల్సిన పనిలేదు. జగన్ కక్షపూరిత రాజకీయాల వల్ల చంద్రబాబుతో సహా అనేకమంది జైళ్లకు వెళ్లాల్సి వచ్చింది. ఆ పార్టీలోని కొందరు నేతలు వైసీపీ హయాంలో హద్దులు మీరి ప్రవర్తించారు. బూతులతో చంద్రబాబు, పవన్, లోకేశ్ సహా వారి కుటుంబ సభ్యులపైనా విరుచుకుపడ్డారు. అసెంబ్లీ వేదికగా చంద్రబాబు కుటుంబాన్ని దారుణంగా అవమానించారు. వారిలో ప్రధానంగా వల్లభనేని వంశీ, కొడాలి నాని, రోజా ఉన్నారు. వీరు మీడియా సమావేశం పెట్టారంటే ఏపీలోని చాలా ఇళ్లలో టీవీలు బంద్ అయ్యేవి. జగన్ కక్షపూరిత రాజకీయాలకుతోడు వైసీపీ నేతల అసభ్యకర వ్యాఖ్యలను జీర్ణించుకోలేకపోయిన ఏపీ ప్రజలు గత ఎన్నికల్లో ఓటు ద్వారా గట్టి గుణపాఠం చెప్పారు. ప్రతిపక్ష హోదాకూడా వైసీపీకి ఇవ్వలేదు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ హయాంలో అవినీతి అక్రమాలకు పాల్పడిన నేతలపై, ఐదేళ్లు హద్దులు మీరి ప్రవర్తించిన నేతలపై ముఖ్యమంత్రి చంద్రబాబు కొరడా ఝుళిపిస్తున్నారు. ఈ క్రమంలోనే జోగి రమేశ్, నందిగం సురేశ్, పేర్ని నానిలపై కేసులు నమోద య్యాయి. జోగి రమేశ్, నందిగం సురేశ్ లు జైలుకెళ్లి బెయిల్ పై బయటకు వచ్చారు. ఇప్పుడు వంశీ జైల్లో ఉన్నారు. అయితే, వంశీని పరామర్శించేందుకు జగన్ మోహన్ రెడ్డి జైలుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో జగన్ జైలుకెళ్లి వంశీని ఎలా సమర్ధిస్తారన్న అంశం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. వంశీ తప్పు చేసినట్లు ఆధారాలతోసహా పోలీసులు నిరూపిస్తున్నారు. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో వంశీతోపాటు పలువురు వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి జైలుకు పంపించగా.. వారిలో కొందరు బెయిల్ పై బయటకు వచ్చారు. ఇటీవల వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ కోర్టులో హాజరుపర్చగా.. వంశీకి కోర్టు 14రోజులు రిమాండ్ విధించింది. ప్రస్తుతం వంశీ విజయవాడలోని జిల్లా జైలులో ఉన్నాడు. అయితే వంశీ అరెస్టైంది గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో కాదు. ఆ కేసులో ఫిర్యాదు దారు సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించిన కేసులో. సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో వంశీపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో పోలీసులకు ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ ను వంశీ ఆధ్వర్యంలో ఆయన అనుచరులు కిడ్నాప్ చేశారు. సత్యవర్ధన్ ను బెదిరించడంతోపాటు కొట్టారు. దీంతో ఇటీవల కోర్టులో తనకు, టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనకు ఎలాంటి సంబంధం లేదని సత్యవర్ధన్ చెప్పాడు. అయితే, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టగా.. సత్యవర్ధన్ ను వంశీ, ఆయన అనుచరులు కిడ్నాప్ చేసి.. బెదిరింపులకు గురిచేసినట్లు తేలింది. దీంతో వంశీపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేసి అరెస్టు చేశారు. వంశీతోపాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. ప్రస్తుతం వంశీ జైల్లో ఉన్నాడు. ఆయన్ను పరామర్శించేందుకే జగన్ మోహన్ రెడ్డి విజయవాడ జిల్లా జైలుకు వెడుతున్నారు. జగన్ వంశీని పరామర్శించేందుకు జైలుకెళ్తే వైసీపీ పరిస్థితి ప్రజల్లో మరింత దిగజారిపోతుందని ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. దళితుల పక్షపాతిగా చెప్పుకునే జగన్.. ఒక దళితుడిని కిడ్నాప్ చేసి బెదరించిన కేసులో అరెస్టైన వల్లభనేని వంశీని జైలుకు వెళ్లి పరామర్శించడం సరికాదని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో వంశీ, కొడాలి నాని, రోజాలు చంద్రబాబు, పవన్, లోకేశ్ పైనా, వారి కుటుంబాలపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలతోనే అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చిందని, ఇప్పుడు వంశీ లాంటి నేతను పరామర్శించేందుకు జగన్ జైలుకెళ్లడం సరియైన నిర్ణయం కాదని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
అన్నిటికీ మించి జగన్ 2.0 అంటూ ఇటీవల కాలంలో తెగ ఊదరగొడుతున్నారు. ఈసారి అధికారంలోకి వస్తే మూడు దశాబ్ధాలు తమదే అధికారం అంటూ జగన్ తన ప్రసంగంలో చెబుతున్నారు. ఇన్నాళ్లు ప్రజల సంక్షేమం కోసం ఆలోచించానని.. ఇకనుంచి జగన్ 2.0గా కార్యకర్తల బాగోగులను పట్టించుకుంటానని, వారికి అండగా ఉంటానని జగన్ హామీలు ఇస్తున్నారు. దీంతో జగన్ లో మార్పు వచ్చిందని వైసీపీ క్యాడర్ భావించింది. అయితే, వంశీ లాంటి నేతను పరామర్శించేందుకు జగన్ జైలుకు వెళ్లడాన్ని వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఇక జగన్ మారరు.. వైసీపీతో ఉండి ఇబ్బందులు పడటం కంటే పార్టీ వీడడమే మేలని మెజారిటీ వైసీపీ నేతలు భావిస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తం మీద జగన్ తాను చెబుతున్న జగన్ 2.0 మాటలన్నీ ఉత్తుత్తివేననీ, ఆయనకు కావలసింది నేర పూరిత స్వభావం ఉన్న, ప్రత్యర్థులపై అసభ్య పదజాలంతో దూషించేందుకు వెనుకాడని వల్లభనేని వంశీ వంటి వారే తప్ప జనం, క్యాడర్, పార్టీ కాదని తేటతెల్లమైందని చెబుతున్నారు.