ఖర్చు భరిస్తాం.. గెలిపిస్తాం.. అభ్యర్థులకు కొండా అభయం

కార్పొరేషన్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీలో కాక రేపుతున్నాయి. వరంగల్‌లో కేడర్‌ను కాపాడుకోడానికి కొండా దంపతులు నానా అవస్థలు పడుతున్నారు. ఎన్నికల నగారా మోగాక పలువురు కిందిస్థాయి నాయకులు పార్టీ మారుతుండటం హస్తం నేతలను కలవరానికి గురి చేస్తోంది. రాజకీయాల్లో నమ్మకద్రోహం సరికాదంటూ వారిని వారించే ప్రయత్నం చేస్తున్నారు కొండా సురేఖ, కొండా మురళి దంపతులు. 

కార్పొరేషన్ ఎన్నికలలో ఎవరూ అమ్ముడుపోవద్దని కొండా సురేఖ హితవు పలికారు. "మీరు అమ్ముడుపోతే కన్నతల్లిని అమ్ముకున్నట్టే.. మీ గెలుపునకు మేము కృషి చేస్తాం, మేమే ఖర్చు భరించి గెలిపిస్తామని" అని సురేఖ అభ్యర్థులకు అభయం ఇచ్చారు. అభ్యర్థులు కూడా ఆర్థికంగా బలంగా ఉండాలని సూచించారు. రాబోయే ఎమ్మెల్యే ఎన్నికలకు ఈ కార్పొరేషన్ ఎన్నికలే పునాది అని ఆమె వ్యాఖ్యానించారు. ఒకవైపు కొవిడ్ విజృంభిస్తుంటే మరోవైపు కార్పొరేషన్ ఎన్నికలు పెట్టారని ఆమె ఆరోపించారు. ఓటమి భయంతోనే కరోనా టైమ్‌లో ఎన్నికలు పెట్టారని సురేఖ విమర్శించారు. 

వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ ఫైట్ కొనసాగనుంది. గతంలో వరంగల్ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా ఉన్న కొండా సురేఖ ఆ తర్వాత టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్‌లో చేరిపోయారు. పరకాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ వరంగల్ ఈస్ట్ నుంచే బరిలో దిగాలను సురేఖ భావిస్తున్నారు. అందుకు గ్రౌండ్ వర్క్‌గా ప్రస్తుతం జరుగుతున్న కార్పొరేషన్ ఎలక్షన్స్‌లో తన వారికి టికెట్లు ఇప్పించుకొని వారిని గెలిపించుకునే బాధ్యతను కొండా కపుల్స్ తీసుకున్నారు. అందుకు అనుగుణంగా.. నగరంలో కాంగ్రెస్ నాయకులతో మీటింగ్ నిర్వహించారు. మేమే ఖర్చు భరిస్తాం.. మేమే గెలిపించుకుంటాం అంటూ అభ్యర్థులకు ధైర్యం నూరిపోశారు కొండా సురేఖ.

ప్రస్తుత వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌కు, కొండా ఫ్యామిలీకి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. సై అంటే సై అంటూ ఇద్దరు నేతలు డివిజన్ల వారీగా అభ్యర్థులను బరిలో నిలుపుతున్నారు. ఇది రెండు పార్టీల పోరుగా కాకుండా.. ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే.. నరేందర్ వర్సెస్ కొండా దంపతులు అన్నట్టుగా మారింది గ్రేటర్ వరంగల్ పుర పోరు.