అయ్యా  సీఎస్.. కొవిడ్ రూల్స్ పట్టవా?

కొవిడ్ పాజిటివ్ వస్తే 14 రోజుల క్వారంటైన్ కంపల్సరీ. రెండు వారాల తర్వాతే కొవిడ్ టెస్టు చేయించుకుని నెగిటివ్ వస్తే బయటికి రావాలి. రెండు వారాలకు ముందే నెగిటివ్ వచ్చినా సరే 14 రోజుల హోం క్వారంటైన్  పాటించాల్సిందే.. ఇది కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన కొవిడ్ మార్గదర్శకాల్లో అత్యంత కీలకం. అంతేకాదు ఇతర దేశాల నుంచి వచ్చిన వారిని, కొవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని కూడా 14 రోజులు హోం ఐసోలేషన్ లో ఉంచుతున్నారు. కొవిడ్ పాజిటివ్ వచ్చిన వ్యక్తి ప్రైమరీ కాంటాక్టులను కూడా రెండు వారాలు ఐసోలేషన్ లో ఉంచుతున్నారు. దేశమంతా ఈ రూలే పాటిస్తున్నారు. 

తెలంగాణలో మాత్రం పరిస్థితి మరోలా ఉంది. ఇక్కడ కొవిడ్ మార్గదర్శకాలు గాలికొదిలేశారు. ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శే కొవిడ్ రూల్స్ బ్రేక్ చేయడం దుమారం రేపుతోంది. కొవిడ్ భారీన పడిన సీఎస్ సోమేష్ కుమార్.. రెండు వారాల క్వారంటైన్ పాటించకుండా మధ్యలోనే  సచివాలయం వచ్చారు. రావడమే కాదు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈనెల 6వ తేదిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్  కరోనా బారిన పడ్డారు.  కొంత అస్వస్థతకు గురైన ఆయన... కోవిడ్ టెస్టులు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన ఏఐజీ హాస్పిటల్ లో చేరారు. ఐదు రోజుల తర్వాత ఇంటికి వెళ్లి హోం క్వారంటైన్ లో ఉన్నారు. కొవిడ్ రూల్స్ ప్రకారం  సోమేష్ కుమార్ 21వ తేదీ వరకు క్వారంటైన్ లో ఉండాలి. కాని ఆయన ఆరు రోజుల ముందే సచివాలయానికి రావడం, అధికారులతో సమీక్షలు జరపడం విస్మయపరుస్తోంది.  

గురువారం సచివాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎస్ సోమేష్ కుమార్..  రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా రోగులకు బెడ్స్ ను పెంచాలని అధికారులను ఆదేశించారు. జిల్లాల్లో కరోనా టెస్టుల సంఖ్యను పెంచాలని కూడా ఆయన  కలెక్టర్లను ఆదేశించారు.ప్రతి ఒక్కరూ మాస్కలు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను కోరారు. ప్రతి జిల్లాలో కోవిడ్ సెంటర్లను రెట్టింపు చేయాలని ఆయన సూచించారు.అంతేకాదు వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడ వేగవంతం చేయాలని సీఎస్ కోరారు.   
 
సీఎస్ సోమేష్ కుమార్ పై గతంలో చాలా ఆరోపణలు ఉన్నాయి. సచివాలయంలో  ఇతర ఉన్నతాధికారులతో ఆయన సఖ్యతగా ఉండరనే విమర్శలు వచ్చాయి. ప్రభుత్వ పరంగా కీలకమైన అంశాల్లోనూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారనే టాక్ ఉంది. అంతేకాదు గతంలో విదేశీ టూర్లకు వెళ్లి వచ్చిన అధికారులు 14 రోజుల వరకు ఆఫీసుకు రావద్దని ఆయనే ఆదేశాలు ఇచ్చారు. అధికారులకు కొవిడ్ నెగెటివ్ వచ్చినా సరే.. రెండు వారాల ఐసోలేషన్ తర్వాతే కార్యాలయానికి రప్పించారని అంటున్నారు. అలాంటిది సీఎస్ కు కొవిడ్ పాటిజివ్ వచ్చినా.. రెండు వారాలు క్వారంటైన్ లో ఉండకుండా ఆయన సచివాలయానికి రావడం, సమీక్షలు చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

కొవిడ్ వచ్చిన కొన్ని రోజులకే సోమేష్ కుమార్ సచివాలయం రావడంతో ఉద్యోగులు అవాక్కయ్యారని తెలుస్తోంది. అయితే సీఎస్ కావడంతో ఎదురుగా అడగలేక.. చాటుగా సీఎస్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. సీఎస్ సమీక్షకు పిలవడంతో ఉన్నతాధికారులు కూడా ఆందోళనకు గురయ్యారట. అయితే సీఎస్ సమీక్ష కావడంతో భయంభయంగానే సమావేశానికి వెళ్లారని తెలుస్తోంది.  మొత్తంగా కొవిడ్ రూల్స్ పక్కాగా పాటించేలా చూడాల్సిన సీఎస్సే... వాటిని బ్రేక్ చేయడం సంచలనంగా మారింది. దీని ద్వారా సీఎస్ జనాలకు రాంగ్ మెసేజ్ ఇచ్చారనే ఆరోపణలు వస్తున్నాయి.