ఛేజింగ్ లో చతికిలపడ్డ సన్ రైజర్స్

Kolkata Knight Riders thrash Sunrisers Hyderabad, IPL-2013 Kolkata Knight Riders beat Sunrisers Hyderabad, Sun Risers Lost IPL-6 League Match Against Kolkata Knight Riders

 

ఐపిఎల్-6 లీగ్ మ్యాచ్ లలో భాగంగా కోల్ కత్తా ఈడెన్ గార్డెన్స్ లో ఆదివారం కోల్ కత్తా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ లో కోల్ కత్తా నిర్దేశించిన టార్గెట్ ను ఛేజ్ చేయలేక సన్ రైజర్స్ చతికిలబడింది. టాస్ గెలిచి బ్యాంటింగ్ కు దిగిన కోల్ కత్తా ఓపెనర్లు ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించారు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్ కు 59 పరుగులు జోడించారు. గంభీర్ తన 39 బంతుల్లోనే అర్థ సెంచరీ చేసిన తరువాత 53 పరుగుల వద్ద ఆశిష్ రెడ్డి బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తరువాత క్రీజ్ లోకి వచ్చిన జాక్విస్ కల్లీస్ బిస్లాతో జతకలిసి వీరవిహారం చేశాడు. బిస్లా 28 పరుగుల వద్ద కరణ్ శర్మ బౌలింగ్ లో విహారీ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరుకున్నాడు. మోర్గాన్ క్రీజ్ లోకి రావడంతోనే సన్ రైజర్స్ బౌలర్లను చితకబాదాడు. మోర్గాన్ 21 బంతుల్లో 47 పరుగులు (5ఫోర్లు, 3 సిక్సర్లు) రనౌట్ గా వెనుదిరిగాడు. యూసుఫ్ పఠాన్ క్రీజ్ 3 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. కల్లీస్ 27 బంతుల్లో 41 పరుగులు (6 బౌండరీలు)చేసి ఇన్నింగ్స్ చివరి బంతికి రనౌట్ అయ్యాడు. కోల్ కత్తా ఇన్నింగ్స్ 4 వికెట్లకు 180 పరుగులు చేసింది. కరణ్ శర్మ 1, ఆశిష్ రెడ్డి 1 వికెట్ తీశారు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సన్ రైజర్స్ కు ఓపెనర్లు పార్థివ్ పటేల్ 31 బంతుల్లో 27 పరుగులు (2 ఫోర్లు, 1సిక్సర్), కామెరూన్ వైట్ 31 బంతుల్లో 34 పరుగులు (3 ఫోర్లు, 1 సిక్సర్) తో 9 ఓవర్లలో 57 పరుగుల భాగస్వామ్యం జతచేశారు. కల్లీస్ బౌలింగ్ లో కెమరూన్ వైట్ కొట్టిన భారీ షాట్ ను బౌండరీలైన్ లో యూసుఫ్ పఠాన్ గాల్లోకి ఎగిరి క్యాచ్ పట్టడంతో సన్ రైజర్స్ వికెట్ల పతనం ప్రారంభమైంది. చివర్లో పెరీరా 25 బంతుల్లో 36 పరుగులు (2ఫోర్లు, 1 సిక్సర్) ధాటిగా ఆడినా మిగతా బ్యాట్స్ మెన్ ఎవరూ రాణించకపోవడంతో నిర్దేశిత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. సంగక్కర 2 పరుగులు, రవితేజ 10, ఆశిష్ రెడ్డి 4, విహారీ 1, కరణ్ శర్మ 5 నాటౌట్, అమిత్ మిశ్రా 1 నాటౌట్ గా నిలిచారు.కలీస్ 3 వికెట్లు, రజత్ భాటియా 2 వికెట్లు, సునీల్ నరైన్ 1 వికెట్ పడగొట్టారు. కోల్ కత్తా నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.