రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా చంద్రబాబు దావోస్ పర్యటన
posted on Jan 18, 2026 10:53AM

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ గా నిలపడం కోసం చంద్రబాబు అరహారం కృషి చేస్తున్నారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడుల ను ఆకర్షించడమే లక్ష్యంగా ఆయన ఆదివారం (జనవరి 18) దావోస్ పర్యటనకు బయలుదేరనున్నారు ఆదివారం (జనవరి 18) రాత్రి 8.35 గంటలకు సీఎం చంద్రబాబు విజయవాడ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరుతారు. ఢిల్లీ నుంచి సోమవారం ( జనవరి 19) తెల్లవారుజామున 1.45 గంటలకు స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌కు చేరుకుంటారు. జ్యూరిచ్‌లోని హిల్టన్ హోటల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుమారు 20 దేశాల నుంచి వచ్చే ప్రవాసాంధ్రులను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించనున్నారు.
ఈ పర్యటన ద్వారా ఆయన మరోసారి విశ్వ వేదికపై తన ముద్ర వేసేందుకు సిద్ధమయ్యారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యుఈఎఫ్) వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నేతృత్వంలోని ఉన్నత స్థాయి బృందం బయలుదేరింది. పెట్టుబడిదారులను ఆకర్షించి, నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ప్రపంచ పారిశ్రామిక పటంలో అగ్రస్థానంలో నిలబెట్టడమే లక్ష్యంగా చంద్రబాబు భారీ ప్రణాళికతో ఈ సదస్సులో పాల్గొంటున్నారు.
సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో పాల్గొననున్న సీఎం చంద్రబాబు ఈ నాలుగు రోజులూ అత్యంత బిజీగా గడపనున్నారు. సదస్సు వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకతలను చాటేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏపీ లాంజ్ ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న సహజ వనరులు, పోర్టులు, నూతన పారిశ్రామిక విధానాలు , ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను ప్రపంచ దేశాల ప్రతినిధులకు వివరించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు పలు కీలక సమావేశాలలో పాల్గొంటారు.
సాంకేతిక , పారిశ్రామిక రంగాల్లో అంతర్జాతీయ దిగ్గజ సంస్థల సి.ఇ.ఓలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖాముఖీ చర్చలు జరపుతారు. ముఖ్యంగా కృత్రిమ మేధ (ఏఐ), క్లౌడ్ కంప్యూటింగ్, మౌలిక సదుపాయాల కల్పన , తయారీ రంగాల్లో సహకారం అంశాలపై ఈ చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో భాగంగా స్విట్జర్లాండ్‌లో భారత రాయబారి మృదుల్ కుమార్ , ఎరోస్ ఇన్నోవేషన్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి మర్యాదపూర్వక భేటీలు నిర్వహిస్తారు. అనంతరం అంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచిన మీడియా సంస్థ ‘పొలిటికో’కు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు. ఈ ఇంటర్వ్యూ ద్వారా ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్లకు తెలియజేయనున్నారు.ఈ పర్యటనలో సీఎం చంద్రబాబుతో పాటు..మంత్రి లోకేష్ నేతృత్వంలో మంత్రుల బృందం, ఉన్నతాధికారులు కూడా ఉన్నారు.