కివీస్ తో తొలి టి20.. టీమ్ ఇండియా పరాజయం

టీమ్ ఇండియా వరుస   విజయాలకు  బ్రేక్ పడింది. న్యూజిలాండ్ తో టి20 సిరీస్ లో భాగంగా రాంచీ వేదికగా శుక్రవారం (జనవరి 27) జరిగిన తొలి మ్యాచ్ లో భాతర్ పోరాడి ఓడింది.  న్యూజిలాండ్ పై వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా  టీ20 సిరీస్ ను మాత్రం ఓటమితో మొదలెట్టింది.

 తొలి టీ20 మ్యాచ్ లో 21 పరుగుల తేడాతో భారత్ పరాజయం పాలైంది. న్యూజిలాండ్ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ (50)   హాఫ్ సెంచరీ వృధా అయ్యింది.

లక్ష్య ఛేదనలో టీమ్ ఇండియా  15 పరుగులకే 3 వికెట్లు కోల్పోవడం లక్ష్యఛేదనపై ప్రభావం చూపింది. గి ల్ 7, ఇషాన్ కిషన్ 4 పరుగులు చేయగా, రాహుల్ త్రిపాఠి డకౌట్ అయ్యాడు. ఈ దశలో సూర్యకుమార్ యాదవ్ 47(34 బంతుల్లో), కెప్టెన్ హార్దిక్ పాండ్యా 21 పరుగులతో జట్టును గాడిలో పెట్టేందుకు ప్రయత్నించారు. అయితే వారిద్దరూ వెంటవెంటనే ఔట్ కావడంతో ఇన్నింగ్స్ నడిపించే భారం వాషింగ్టన్ సుందర్ పై పడింది.

అతడికి మరో ఎండ్ నుంచి సహకారం కరవైంది. దాంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. కివీస్ బౌలర్లలో మైకేల్ బ్రేస్వెల్, శాంట్నర్, ఫెర్గుసన్ చెరో 2 వికెట్లు తీశారు. డఫీ, సోధీ తలో వికెట్ తీశారు.  అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. ఈ విజయంతో మూడు టీ20 ల సిరీస్ లో 1-0తో కివీస్ లీడ్ లో ఉంది.   ఇరుజట్ల మధ్య రెండో టి20 ఆదివారం (జనవరి 29) లక్నో వేదికగా జరుగుతుంది.