యువగళం డే నంబర్ 1.. ఆకట్టుకున్నారు.. అదరగొట్టేశారు!

తొలి అడుగు అదిరింది. ఆరంభం బ్రహ్మాండంగా ఉంది. కుప్పం నుంచి శుక్రవారం ఉదయం ప్రారంభమైన నారా లోకేష్ యువగళం పాదయాత్ర అధికార పార్టీపై విమర్శలతో, ప్రజా సమస్యల పరిష్కారం హామీలతో సాగింది. అదే సమయంలో పరోక్షంగానైనా జనసేన, తెలుగుదేశం మధ్య పొత్తు ఉంటుందన్న సందేశాన్నీ ఇచ్చింది.  ఈ సందర్భంగా లోకేష్ వేసిన ప్రతి అడుగులోనూ ఆయనలో పరిణితి చెందిన నాయకుడు కనిపించాడు. రాజకీయ విమర్శలు చేస్తూనే వాటిని ప్రజా సమస్యలతో మేళవించారు. తన రాజకీయం ప్రజల కోసమేననీ, రాష్ట్రంలో దుష్టపాలన అంతం చేయడానికేననీ విస్పష్టంగా చాటారు.  

తొలి రోజు పర్యటనలో ఆయన ప్రసంగం ప్రజాసమస్యలను ప్రస్తావిస్తూ, జగన్ సర్కార్ ను ఎండగడుతూ సాగింది. ఎక్కడా తడబాటు లేదు. తనపై, తెలుగుదేశంపై మంత్రులు గతంలో చేసిన విమర్శలకు తనదైన శైలిలో కౌంటర్లు వేశారు. ముఖ్యమంత్రిని జాదూరెడ్డిగా అభివర్ణించారు. రాష్ట్రంలో జాదూ రెడ్డి పాలన అంతా జాదూయే అని చెప్పారు.  జగన్ పాలనా వైఫల్యాలను ఎండగట్టారు.  మూడున్నరేళ్లుగా వైసీపీ ప్రభుత్వం పీకింది ఏమిటని ప్రశ్నించారు.  తెలుగుజాతి గర్వపడేలా దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ రాష్ట్రానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారు. యావత్ ప్రపంచం అచ్చెరువొందేలా చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. జాదూరెడ్డి వచ్చి  రాష్ట్రాన్ని 67 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని విమర్శించారు.

మైసూర్ బోండాలో మైసూర్ ఉండదు, అలాగే జాదూరెడ్డి జాబ్ క్యాలెండర్లో జాబ్ లు ఉండవు అంటూ ఎద్దేవా చేశారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే యువత కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.  ఇక మంత్రి రోజాకు ఘాటు కౌంటర్ ఇచ్చారు. తనకు చీర, గాజులు పంపిస్తామని ఓ మహిళా మంత్రి అన్నారు.. పంపమనండి వాటిని మా అక్కాచెల్లెమ్మలకు ఇచ్చి కాళ్లు మొక్కుతానని కౌంటర్ ఇచ్చారు. తాను తల్లి, చెల్లిని గెంటేసేవాడిని కాదన్నారు.   జే బ్రాండ్‌ మద్యంతో జాదూరెడ్డి మహిళల మంగళసూత్రాలు తెంపుతున్నాడంటూ విమర్శించారు.  రైతు ఆత్మహత్యల్లో ఏపీ మూడోస్థానంలో ఉందన్నారు.  జే ట్యాక్స్‌ కట్టలేక పరిశ్రమలను ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయన్నారు. వీధుల్లో డ్యాన్సులు వేస్తేనో.. క్యాసినో ఆడిస్తేనో పరిశ్రమలు రావని ఎద్దేవా చేశారు.  

ఎక్కడా తడబాటు లేకుండా జగన్ వైఫల్యాలనూ, తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది అన్న విషయాలను సూటిగా, స్పష్టంగా జన హృదయాలను హత్తుకునేలా చెప్పారు. తాను పాదయాత్ర పేరు ప్రకటించగానే వైసీపీ నేతల ఫ్యాంట్లు తడిసిపోయాయన్నారు. అందుకే జీవో నంబర్ 1 తెచ్చారని లోకేష్ అన్నారు. పాదయాత్ర అనుకోగానే తన సన్నిహితులు కొందరు వారించారనీ, సొంత బాబాయ్ ని చంపేసిన వ్యక్తి.. ఎంతకైనా తెగిస్తాడు వద్దని చెప్పారనీ లోకేష్ అన్నారు. అయితే  స్టాన్‌ఫోర్డ్‌ వర్సిటీలో చదివా. వరల్డ్‌ బ్యాంక్‌లో పనిచేశా. హెరిటేజ్‌ వంటి పెద్ద వ్యాపార సంస్థను నిర్వహించా. ప్రజల కంట కన్నీరు చూసి పాదయాత్ర చేస్తున్నానని వారిని సముదాయించానన్నారు, భయం అన్నది నా బయోడేటాలోనే లేదు అని లోకేష్ ఉద్ఘాటించారు. తెలుగుదేశం ప్రభుత్వం రాగానే యూత్‌ మేనిఫెస్టో తెస్తామన్నారు, ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహించి ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇసుకను ఉచితంగా ఇస్తామన్నారు.

ఇలా ఏం చేస్తామో చెప్పడమే కాకుండా.. తాను మంత్రిగా ఉన్నప్పుడు చేసినదేమిటో కూడా చెప్పారు.  పంచాయతీరాజ్‌ మంత్రిగా 25 వేల కిలోమీటర్ల   సిమెంట్‌ రోడ్లు వేయించా, పల్లెల్లో 25 లక్షల వీధి దీపాలు ఏర్పాటు చేయించా. 25 వేల కోట్లతో ఇంటింటికీ కుళాయిల ఏర్పాటుకు చర్యలు చేపట్టాం. ఐటీ మంత్రిగా పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేసి రాష్ట్రంలో 80 వేల మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించానని లోకేష్ గుర్తు చేశారు. ఈ మూడున్నరేళ్లలో జగన్ సర్కార్ ప్రజల కోసం చేసిన ఒక్క మంచి పని ఉందా అని ప్రశ్నించారు.