కిషన్‌రెడ్డి అలకపాన్పు!
posted on Apr 5, 2014 2:24PM

రాష్ట్ర బీజేపీకి కిషన్ రెడ్డి పెద్ద గుదిబండలా తయారయ్యారు. ప్రతి సందర్భంలోనూ లేనిపోని ఇష్యూలు క్రియేట్ చేసి తలనొప్పులు సృష్టిస్తున్నారు. తెలంగాణ ఇష్యూని సాధ్యమైనంత ఎక్కువగా రాజేసీ, సుష్మా స్వరాజ్ తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చేలా చేయడంలో కిషన్‌రెడ్డి పాత్ర ఎంతో వుంది. ఇప్పుడు తెలుగుదేశంతో పొత్తుల ఇష్యూ జీడిపాకంలా సాగడానికి కూడా కిషన్ రెడ్డే కారణమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. పొత్తు కుదిరేదాకా వచ్చిన ప్రతిసారీ కిషన్ రెడ్డి దాన్ని చెడగొట్టడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు.
ఇదిలా వుంటే ఇప్పుడు ఆయన తాజాగా అలక సీన్ సృష్టించారు. తాను ఈసారి ఎన్నికలలో పోటీ చేయడం లేదని బాంబు పేల్చారు. అలా ఎందుకని అడిగితే, ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ అంతటా పర్యటించాల్సి వుంటుంది కాబట్టి తాను పోటీ చేయదలచుకోవడం లేదని చెప్పారు. అయితే దీనికి వెనుక అసలు కారణం మరోటి వుందని తెలుస్తోంది. ప్రస్తుతం అందరి చూపూ మల్కాజిగిరి లోక్‌సభ స్థానం మీదే వుంది. చాలామంది అక్కడి నుంచి పోటీ చేసి గెలవాలని తహతహలాడుతున్నారు. ఆతహతహ కిషన్‌రెడ్డికి కూడా మొదలైంది.
మొన్నటి వరకూ సికింద్రాబాద్ పార్లమెంట్ సీట్ నుంచి పోటీ చేసి దత్తాత్రేయకి జెల్ల కొట్టాలని కిషన్‌రెడ్డి ప్రయత్నించారు. అయితే కిషన్‌రెడ్డిని అంబర్ పేట నుంచే పోటీ చేయించాలని బీజేపీ అగ్ర నాయకత్వం భావిస్తోంది. ఈ మేరకు కిషన్ రెడ్డికి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలకి హర్టయిన కిషన్ రెడ్డి అస్సలు పోటీయే చేయనని అలిగి కూర్చున్నారు. అలిగిన తనను బీజేపీ అగ్ర నాయకత్వం బుజ్జగించి పార్లమెంట్‌కి పోటీ చేయిస్తుందని కిషన్‌రెడ్డి ఆశిస్తున్నారని సమాచారం.