బీజేపీలోకి కిరణ్ కుమార్ రెడ్డి?
posted on Nov 6, 2014 12:59PM
.jpg)
ఎన్నికల తరువాత రాష్ట్ర రాజకీయాలను నుండి అదృశ్యమయిపోయిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మళ్ళీ త్వరలో మంచి ముహూర్తం చూసుకొని బీజేపీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో అడుగు పెట్టబోతున్నట్లు తాజా సమాచారం. అందుకోసం ఆయన సోదరుడు సంతోష్ రెడ్డి కర్నాటకకు చెందిన ఒక కేంద్ర మంత్రితో ద్వారా బీజేపీ అధిష్టానంతో చేసిన రాయబారం ఫలించినట్లు తాజా సమాచారం.
వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో బలపడాలని తెగ ఉవ్విళ్ళూరుతున్న బీజేపీ ఆయనను పార్టీలోకి స్వాగతిస్తే ఆశ్చర్యమేమీ లేదు. ఇప్పుడు బీజేపీలో అనేకమంది కాంగ్రెస్ నేతలు వచ్చి చేరుతున్నారు. కానీ రాష్ట్రంలో ఆ పార్టీ ఇంకా బలపడాలంటే ఆయన సామాజిక వర్గానికి చెందినవారు కూడా చాలా అవసరం. ముఖ్యంగా రాయలసీమ రాజకీయాలను శాసిస్తున్న ఆయన వర్గాన్ని కనుక బీజేపీ తన వైపు తిప్పుకోగలిగినట్లయితే, బీజేపీ బలం అనూహ్యంగా పెరిగిపోతుందని వేరే చెప్పనవసరం లేదు. అందువలన రాయలసీమకే చెందిన ఆయన బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపినట్లయితే బీజేపీ ఎగిరి గెంతేసి మరీ ఆహ్వానం పలకవచ్చును. కానీ ఆయన ఇదేపని రాష్ట్ర విభజనకు ముందు చేసి ఉండి ఉంటే, బీజేపీ కూడా రాష్ట్ర విభజనకు మద్దతు పలికేదికాదేమో? అప్పుడే కనుక ఆయన బీజేపీలో చేరి ఉండిఉంటే, బహుశః బీజేపీ పగ్గాలు ఆయన చేతికే వచ్చేవేమో కూడా? ఏమయినప్పటికీ, ఒకవేళ ఇప్పటికయినా ఆయన బీజేపీలో చేరాలని భావిస్తే అది చాలా మంచి నిర్ణయమేనని చెప్పవచ్చును.