అవిశ్వాసానికి స్వాగతం: కిరణ్ కుమార్ రెడ్డి

 

కొద్ది రోజుల క్రితం పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ నుండి 9మంది (జగన్ వర్గం) శాసనసభ్యులను బహిష్కరిస్తునట్లు ప్రకటన చేసిన రోజు నుండి నేటివరకు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపెట్టే విషయంపై ప్రతిపక్షలలో చాలా రాద్ధాంతం జరుగుతోంది. అయినా ఎవరూ కూడా అవిశ్వాసం పెట్టేందుకు సాహసించలేకపోతున్నారు. (అందుకు కారణాలు ఇదివరకు ఇదే పేజీలో విశ్లేషించడం జరిగింది గనుక మళ్ళీ వాటిని ఇక్కడ ప్రస్తావించడం లేదు.)

 

కారణాలు ఏమయినప్పటికీ, రాష్ట్రంలో ఇంతవరకు చేసిన ఏ ముఖ్యమంత్రికూడా బహుశః కిరణ్ కుమార్ రెడ్డిలా ఇన్నిసార్లు అవిశ్వాసం ఎదుర్కొనే దుస్థితిని ఎరిగిఉండరు. అదేవిధంగా ఆయనలా ధైర్యంగా అవిశ్వాస తీర్మానాన్ని ఆహ్వానించిన వారు కూడా ఉండిఉండరు. ప్రతిపక్షాల బలహీనతలను గ్రహించిన ముఖ్యమంత్రికిరణ్ కుమార్ రెడ్డి నిన్న మీడియాతో మాట్లాడుతూ, ప్రతిపక్షాలను తన ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టమని మళ్ళీ మరోమారు స్వయంగా ఆహ్వానించారు.

 

అదే సమయంలో గుంటూరులో పాదయాత్ర చేస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల కూడా ‘కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టకుండా చంద్రబాబు ఎందుకు తాత్సారం చేస్తున్నాడో తనకు అర్ధం కావట్లేదని, కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవడానికి వెంటనే అవిశ్వాస తీర్మానం పెట్టాలని’ ఆమె డిమాండ్ చేసారు. ఆ అప్పుడు చంద్రబాబు ‘ఆ పనేదో మీరే చేయోచ్చును కదా!’ అని తిప్పికొట్టడం కూడా షరా మామూలే.

 

ఇద్దరూ కూడా తమ పాదయాత్రలో నిత్యం కిరణ్ కుమార్ రెడ్డి నామస్మరణం చేయకుండా ఉండలేని పరిస్థితి. ఆయనని, అయన ప్రభుత్వాన్ని, ఆయన పార్టీని దుమ్మెత్తి పోయడంలో వారిరువురూ పోటీలు పడుతున్నపటికీ, అయన ప్రభుత్వాన్ని కూల్చడానికి సాహసించలేకపోతున్నారు. వీరిరువురి అవిశ్వాస పోరాటాలు చూసి చివరికి ప్రజలే కాదు, వారి దయతో ప్రభుత్వం నడుపుకొస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి కూడా నవ్వుకొంటున్నారు.