ముఖ్యమంత్రికి మరో అగ్ని పరీక్ష

 

త్వరలో పదవీ విరమణ చేయనున్న ఐదుగురు శాసనమండలి-సభ్యులు పొంగులేటి సుధాకరరెడ్డి, ధీరావత్‌ భారతీ నాయక్‌, ఇంద్రసేన్‌రెడ్డి, లక్ష్మీ దుర్గేశ్‌, పుల్లా పద్మావతిలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మరో అగ్ని పరీక్షను తెచ్చిపెట్టారు. శాసన సభ్యుల కోటాలో ఎన్నికయిన వారి ఐదు స్థానాలను, మారిన రాజకీయ సమీకరణాల నేపద్యంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే దక్కేలా చేయడం నిజంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అగ్నిపరీక్ష వంటిదే.

 

ఒక్కో శాసనమండలి సభ్యుడి ఎన్నికకి 29.3 ప్రథమ ప్రాధాన్యతా వోట్లు అవసరం కాగా, కాంగ్రెస్ తన 155 మంది శాసనసభ్యుల బలంతో అవలీలగా ఐదుగురు శాసనమండలి సభ్యులను గెలిపించుకోలిగేది. కానీ, కొద్ది రోజుల క్రితం పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చాలా ఆర్భాటంగా జగన్ అనుచరులయిన 9మంది శాసన సభ్యులను పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్లు ప్రకటన చేయడంతో, పార్టీ పరిస్థితి ఒక్కసారిగా తలక్రిందులయింది. 155 మంది శాసనసభ్యుల నుండి వారిని తీసేస్తే కేవలం 146 మంది మాత్రమె మిగులుతారు.

 

అయితే, వారు కిరణ్ కుమార్ ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరిస్తున్నట్లు కానీ, వారిని బొత్స సత్యనారాయణ ప్రకటించినట్లుగా ఇంతవరకు పార్టీ నుండి బహిష్కచడం గానీ జరుగనందున, ఆ 9 మంది సభ్యుల కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ లేనట్లే లెక్క. అందువల్ల పార్టీకి వారి మద్దత్తు ఉంటుందనే నమ్మకం లేదు. అందుకు ప్రధాన కారణం బొత్స చేసిన ప్రకటనేనని చెప్పక తప్పదు.

 

ఆయన తన ప్రకటనతో జగన్ వర్గానికి ఒక సవాలు విసిరడంతో, వారు కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు వేచి చూస్తున్నారు. ఇటువంటి తరుణంలో శాసనమండలి ఎన్నికలు ఎదుర్కోవలసి రావడంతో కిరణ్ కుమార్ రెడ్డికి కొంచెం ఇబ్బందే. ఒకవేళ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 17 మంది శాసన సభ్యులు, ఇటీవలే కాంగ్రెస్ పార్టీని వీడిన మజ్లిస్‌ పార్టీతో కానీ చేయి కలిపితే వారి బలం (మజ్లిస్ 7 మంది సభ్యులతో కలిపి) మొత్తం 24 అవుతుంది. అప్పుడు, కాంగ్రెస్ పార్టీలో నేటికీ శాసన సభ్యులుగా కొనసాగుతున్న 9 మంది జగన్ అనుచరులను కూడా కలుపుకొంటే వారి మొత్తం బలం 33 అవుతుంది. ఒక శాసనమండలి సభ్యుడి ఎన్నికకి 29.3 ప్రథమ ప్రాధాన్యతా వోట్లు అవసరం కాగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మొత్తం 33 మంది సభ్యులు ఉన్నందున, ఆ పార్టీ సులభంగా ఒక స్థానాన్ని కైవసం చేసుకోగలదు.

 

ఉన్న 5 స్థానాలలో ఒకటి కోల్పోవడం అంటే ప్రభుత్వానికి కొంత ఇబ్బందే గనుక ఆ ఒక్క స్థానాన్ని ఎలా తిరిగి దక్కించుకోవాలనేదే కిరణ్ కుమార్ రెడ్డికి ఒక పరీక్ష కాబోతోంది. పార్టీలో ఉన్న జగన్ అనుచరులను ఆయన నయాన్నో భయన్నో నచ్చచెప్పుకొంటారా, లేక మళ్ళీ మజ్లిస్ తో బేరాలు చేసుకొంటారా లేక ఏమయితే అయింది లెమ్మని ఒక స్థానాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వదులుకుంటారా చూడాలి.

 

అయితే, కిరణ్ కుమార్ రెడ్డి ఈ పరీక్షలో కూడానెగ్గినట్లయితే అది ఆయన రాజకీయ చతురతకి నిదర్శనంగా నిలబడటమే కాకుండా, సహకార ఎన్నికల గురించి లేనిపోని గొప్పలు చెప్పుకొంటున్నాడని పార్టీలో తనను విమర్శిస్తున్నవారికి కూడా జవాబు చెప్పినట్లవుతుంది. అంటే కాకుండా అవకాశం దొరికినప్పుడల్లా తన కుర్చీ కింద మంట రాజేయాలని చూస్తున్న బొత్స సత్యనారాయణకు కిరణ్ తన సత్తా చాటిచూపినట్లవుతుంది.