అవినీతిపరులకు కొమ్ముకాస్తున్న సర్కారు: కోడెల
posted on Dec 30, 2011 9:27AM
హైదరాబాద్: రాష్ట్రంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు అవినీతిపరులకు కొమ్ముకాస్తోందని తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత,మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ రావు ఆరోపించారు. ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ మంత్రివర్గంలో ఉన్న సగం మంది మంత్రులు దొంగలేనని, ఈ దొంగలే రాష్ట్రాన్ని పాలిస్తున్నారంటూ అయన ఆరోపించారు. ప్రస్తుత మంత్రివర్గంలోని బొత్స సత్యనారాయణ, వట్టి వసంతకుమార్, కన్నా లక్ష్మీ నారాయణ, రఘువీరా రెడ్డి, ధర్మాన ప్రసాద రావు, మోపిదేవి వెంకట రమణలు దొంగలన్నారు. వీరితో పాటు మరికొందరు అవినీతి పరులున్నారని చెప్పారు.అంతేకుండా రాష్ట్ర గనుల శాఖలో అవినీతి జరుగుతుందని, అయినా తానేమీ చేయలేక పోతున్నట్టు సాక్షాత్ ఆ శాఖ బాధ్యతలను నిర్వహిస్తున్న మంత్రి గల్లా అరుణ కుమారే స్వయంగా చెప్పారన్నారు. అలాంటపుడు ఆమె మంత్రిగా ఎందుకు కొనసాగుతున్నారని మండిపడ్డారు.
వోక్స్‌వ్యాగన్ కుంభకోణంలో చిక్కుకున్న అధికారులు జర్మనీలో ఊసలు లెక్కిస్తున్నారని, కానీ, ఇదే కుంభకోణంలో చిక్కుకున్న మంత్రి బొత్స సత్యనారాయణకు మాత్రం మంత్రి పదవుల్లో ప్రమోషన్, పీసీసీ అందలం ఎక్కించ్చిందని అయన ధ్వజమెత్తారు.ఈ ప్రభుత్వంలోని మంత్రులంతా తమ పదవులను కాపాడుకునేందుకే నానా ప్రయాసలు పడుతున్నారని ఆరోపించారు. సాక్షాత్ మంత్రివర్గంలోని మంత్రులపైనే సహచర మంత్రి అవినీతి ఆరోపణలు చేసినా దమ్ముంటే తనను మంత్రివర్గం నుంచి తప్పించాలని సవాల్ విసిరినా ముఖ్యమంత్రి చేతగాని దద్దమ్మలా చూస్తూ ఉండిపోయారన్నారు.