బొత్స ను ప్రశ్నించిన దాడి
posted on Dec 30, 2011 9:45AM
హైదరాబా
ద్: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నటనలో కమల్ హాసన్‌ను మించాడని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దాడి వీరభద్ర రావు ఎద్దేవా చేశారు.దాడుల అనంతరం ఎసిబి నివేదిక వచ్చిన వెంటనే ఢిల్లీ వెళ్లి పేర్లు బయటకు రాకుండా ఆదేశాలు జారీ చేయించుకున్నారని విమర్శించారు. ఎసిబి నివేదిక బయటపెట్టలేని ముఖ్యమంత్రి కిరణ్ బలహీనుడని విమర్శించారు. రాష్ట్రంలో,కేంద్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెసు పార్టీయే అని అలాంటప్పుడు బొత్స విచారణ జరిపించమని ఎవరిని అడుగుతున్నారని ప్రశ్నించారు. తనకు 31 దుకాణాల్లో వాటాలున్నాయని చెప్పిన బొత్స ఆ దుకాణాల్లో ఎమ్మార్పీ ధరకే అమ్ముతున్నారా అని ప్రశ్నించారు.మద్యం విక్రయాల్లో అక్రమాలే లేవని బుకాయిస్తున్న బొత్స ముందు తమ కుటుంబ నేతృత్వంలోని మద్యం షాపుల్లో ఎమ్మార్పీకి అమ్ముతున్నది లేనిదీ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదు సెంటర్ ఏర్పాటు ఉత్తిదే అన్నారు. అసలు రాష్ట్రంలో ఎక్కైడైనా ఎమ్మార్పీకి అమ్మితే కదా మిగతా వారిపై ఫిర్యాదు చేసేదన్నారు. ఎమ్మార్పీకి మద్యం విక్రయించాలన్న ప్రభుత్వం ఆదేశాలను నిరసిస్తూ బంద్ పాటించిన మద్యం షాపుల్లో బొత్సవి కూడా ఉన్నాయని ఆయన చెప్పారు. మిగిలిన ప్రభుత్వ విభాగాల్లో పని చేసినందుకు జీతాలు ఇస్తుంటే ఎక్సైజ్ విభాగంలో మాత్రం పని చేయనందుకు జీతాలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు.